news18-telugu
Updated: September 19, 2019, 3:18 PM IST
నాసా LRO (Source - Wikipedia)
12 రోజులైంది. విక్రమ్ నుంచి సిగ్నల్ రాలేదు. చంద్రమండలంపై విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియడం లేదు. విక్రమ్‌తో కమ్యూనికేషన్ కోసం ఇస్రో రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైతం సాయం చేస్తోంది. ఐనా అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. విక్రమ్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమోనని యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతం వైపు నుంచే మంగళవారం తమ లూనార్ రెకొనసెన్స్ ఆర్బిటర్ (LRO) వెళ్లిందని.. కానీ దాని కెమెరాకు విక్రమ్ చిక్కలేదని ప్రకటించింది.
లూనార్ రెకొనసెన్స్ ఆర్బిటర్ కెమెరా (LROC) ద్వారా సెప్టెంబర్ 17న తీసిన చిత్రాలను, అందకు ముందు తీసిన చిత్రాలను పోల్చి చూసిన LROC టీమ్.. అందులో విక్రమ్ కనిపించలేదని తెలిపింది. లూనార్ రెకొనసెన్స్ ఆర్బిటార్ కెమెరా విక్రమ్ ల్యాండర్‌ను ఫొటోలను తీయలేకపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం విక్రమ్ దిగిన ప్రాంతంలో వాతావరణం దుమ్ము, ధూళితో ఉందని.. విక్రమ్‌ను ఫొటో తీయలేకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉంటుందని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. సెప్టెంబరు 17, అంతకుముందు తీసిన చిత్రాలను విశ్లేషిస్తున్నామని.. త్వరలోనే వాటిని విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ఐతే చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచీ విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
విక్రమ్‌తో ఇస్రో కమ్యూనికేషన్ కోల్పోయి 12 రోజులవుతోంది. మరో రెండు రోజులు గడిస్తే విక్రమ్ ల్యాండర్‌తో పాటు ప్రజ్ఞాన్ రోవర్‌ని మర్చిపోవాల్సిందే. ఎందుకంటే చంద్రుడిపై విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేసేది 14 రోజులే. ఇక మిగిలింది రెండు రోజులే ఉండడంతో విక్రమ్ నుంచి సిగ్నల్ వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా చంద్రయాన్-2 ప్రయోగం విఫలమయినట్లుగా మనం భావించకూడదు. చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఇంతకు వరకు ఏ దేశమూ వెళ్లలేదు. కానీ అలాంటి ప్రాంతానికి ఇస్రో తొలిసారిగా విక్రమ్‌ను పంపి చరిత్ర సృష్టించింది.
Published by:
Shiva Kumar Addula
First published:
September 19, 2019, 3:15 PM IST