భారత రాజ్యాంగం ప్రకారం రెండో అత్యున్నత పదవి.. దేశ రెండో పౌరుడు లేదా పౌరురాలుగా భావించే ఉపరాష్ట్రపతి ఎన్నికకు (Vice Presidential Election 2022) రంగం సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఇవాళ శనివారం జరుగనుంది. నేటి సాయంత్రానికే కొత్త ఉపరాష్ట్రపతి ఎవరన్నది అధికారికంగా తేలిపోనుంది. (Jagdeep Dhankhar vs Margaret Alva) పార్లమెంటులోని ఉభయసభల సభ్యులు తమ ఓటును వినియోగించుకుని ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి తరపున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కఢ్ బరిలో ఉండగా.. ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా పోటీ చేస్తున్నారు. ధన్‌కఢ్‌కు ఉన్న మద్దతు దృష్ట్యా ఆయన విజయం లాంఛనమేననే అంచనాలున్నాయి. అల్వా ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదంటూ కినుక వహించిన తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉండనుండటం గమనార్హం.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, మజ్లిస్, సమాజ్ వాదీ వంటి పార్టీలు మద్దతును తెలిపాయి. ఇక జేడీయూ, వైసీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన తదితర పార్టీల మద్దతుతో ఎన్‌డీయే అభ్యర్థి ధన్‌కఢ్‌కు 515కు పైగా ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతిగా విజయం సాధించేందుకు అవి సరిపోతాయని, అల్వాకు 200 ఓట్లకు అటూఇటూగా రావొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు అల్వాకు ఓటు వేస్తారని తెలిపారు. శుక్రవారం సాయత్రం కేకే నివాసంలో టీఆర్‌ఎస్ ఎంపీలతో ఆల్వా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మార్గరెట్ ఆల్వా.. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి మొక్కను నాటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Monsoon session Parliament, Parliament, Vice President Elections 2022, Vice President of India