అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూ సంస్థలు పోరు ఉద్ధృతం చేశాయి. ఆలయ నిర్మాణం ప్రారంభంపై చర్చించేందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం అయోధ్యలో భారీ ధర్మసభను నిర్వహించబోతోంది. 1992 డిసెంబర్ 6న వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో వచ్చినట్లుగానే రేపటి సభకు కూడా కరసేవకులు వచ్చే వీలుంది. ఇవాళ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తమ కార్యకర్తలతో కలిసి అయోధ్యకు వెళ్తున్నారు.
ధర్మసభకు దాదాపు లక్షమంది కరసేవకులు హాజరవుతారని వీహెచ్‌పీ తెలిపింది. ఇది రాజకీయ సభ కాదనీ, దీనికి రాజకీయ నేతలు ఎవరూ రారని వివరించింది. రామమందిర నిర్మాణ తేదీని ఖరారు చేసేందుకే ఈ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీని తర్వాత ఎలాంటి సభలు, ర్యాలీలు, నిరసనలు, చర్చలు ఉండవని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ లేదా పార్లమెంట్‌లో బిల్లు తేవడం ద్వారా మందిర నిర్మాణం చేపట్టేందుకు ఈ సభ ద్వారా కేంద్రానికి గట్టి సంకేతం పంపుతాం అని వీహెచ్‌పీ ప్రాంతీయ నిర్వాహక కార్యదర్శి చెప్పారు. 25న నాగ్‌పూర్, బెంగళూరులో, డిసెంబర్ 9న ఢిల్లీలో ఇలాంటి ర్యాలీలు చేపడతామని వివరించారు.
గుడి కోసం ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ఇంకా ఎంత సమయం తీసుకుంటుందని శివసేన నిలదీసింది. ఆర్డినెన్స్ పత్రాలు తయారు చేసేందుకు, రాష్ట్రపతి భవన్ నుంచి యూపీ అసెంబ్లీకి అవి చేరేందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించిన శివసేన.... అక్కడా ఇక్కడా ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కదా అని మండిపడింది. మందిరం కోసం ఆర్డినెన్స్ తేవాలనీ, నిర్మాణ తేదీని స్పష్టం చెయ్యాలని శివసేన తమ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో డిమాండ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir, Bjp, Shiv Sena, VHP