జర్నలిజంలో తనదైన శైలితో దేశవ్యాప్తంగా పాపులరైన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా(67) ఇకలేరు. కరోనా అనంతరం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ ఏడాది ఆరంభంలో దువాకు కొవిడ్ సోకగా, అప్పటి నుంచీ ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఇటీవల పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. వినోద్ దువా మరణాన్ని ఆయన కూతురు మల్లికా దువా నిర్ధారించారు.
జర్నలిస్ట్ వినోద్ దువా, ఆయన భార్య పద్మావతి దువా(ప్రముఖ రేడియాలజిస్ట్) సెకండ్ వేవ్ లో కరోనా బారినపడ్డారు. కొవిడ్ మహమ్మారి ఇద్దరి ఆరోగ్యాలను క్షీణింపజేసింది. పద్మావతి దువా జూన్ లో కొవిడ్ కారణంగా కన్నుమూయగా, ఇప్పుడు వినోద్ దువా కొవిడ్ అనంతర ఆరోగ్య సభస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. సీనియర్ జర్నలిస్ట్ మృతిపై పాత్రికేయలోకం, రాజకీయ, ఇతర రంగాల ముఖ్యులు సంతాపాలు తెలిపారు. ఢిల్లీలోని లోథి స్మశానవాటికలో ఆదివారం మధ్యాహ్నం దువా అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.
“చివరిదాకా ధైర్యంగా ఉంటూనే మా నాన్న వినోద్ దువా మరణించారు. ఢిల్లీలోని శరణార్థుల కాలనీలో నివసించిన ఆయన.. 42ఏళ్ల పాత్రిక్రేయంలో శిఖరానికి చేరుకున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ ఎప్పుడూ నిజాన్నే మాట్లాడారు. మా నాన్ని ఇప్పుడు.. తనకెంతో ప్రియమైన మా అమ్మ దగ్గరికి వెళ్లిపోయారు. అక్కడ ఇద్దరూ పాడుతూ, వంట చేసుకుంటూ ఆనందమయ జీవితాన్ని కొనసాగిస్తారు..” అంటూ తండ్రి మరణంపై మల్లికా దువా ఎమోషన్ పోస్ట్ పెట్టారు.
42ఏళ్ల జర్నలిజం కెరీర్ లో వినోద్ దువా ఎన్నో శిఖరాలను అధిరోహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న దువా.. హిందీ జర్నలిజం ఆద్యులలో ఒకరిగా పేరు పొందారు. దూరదర్శన్, ఎన్‌డీటీవీలో పనిచేశారు. ఇటీవల పలు వెబ్‌షోలలో రాజకీయ కామెంట్రీలతో కూడా అలరించారు. జర్నలిజంలో చేసిన అత్యుత్తమ సేవలకు గాను 1996లో వినోద్ దువాకు రామ్‌నాథ్ గోయెంగా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు లభించింది. 2008లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. ప్రధాని మోదీపై విమర్శలు చేసి కేసులు ఎదుర్కొన్నారు. వినోద్ దువాపై మీటు ఆరోపణల సైతం వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Delhi, Journalist