దేశంలో నానాటికీ పెరుగుతున్న మహిళల వేధింపులకు చెక్ పెట్టడానికి కేంద్రం కొత్త టెక్నాలజీని ఉపయోగించబోతున్నది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మహిళలపై నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏడాది పాప నుంచి మొదలు.. 90 ఏళ్ల ముసలి వరకు అక్కడ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దీంతో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ క్రైం రేట్ ఎక్కువగా నమోదవుతున్నది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసులు ఎన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీంతో అక్కడ అధునాతన టెక్నాలజీని వాడి.. ఆగంతకుల ఆట కట్టించాలని అక్కడి బీజేపీ సర్కారు భావిస్తుంది.
యూపీలో ఆర్టిఫిషయల్ టెక్నాలజీ సాయంతో కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే యూపీ రాజధాని లక్నోలో ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 200 హాట్ స్పాట్ లను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతాల నుంచే మహిళలకు లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఈ సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని లక్నో పోలీస్ కమిషనర్ డికె ఠాకూర్ తెలిపారు.
ఇటీవలే లక్నోలో జరిగిన ‘సేఫ్ సిటీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఈ 200 హాట్ స్పాట్ ల నుంచే ఎక్కువ కేసులు వచ్చాయని అన్నారు. లక్నోలో మహిళలపై నేరాలను నివారించడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఇలా చేయడం దేశంలో ప్రథమమని ఆయన వివరించారు. లక్నోను సురక్షిత నగరంగా చేయాలన్నదే తమ ధ్యేయమని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని లక్నోలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని.. ఆ తర్వాత రాష్ట్రమంతటా దీనిని విస్తరిస్తామని తెలిపారు.
ఈ కెమెరాలు ఎలా పనిచేస్తాయంటే...?
లక్నోలో అమర్చనున్న ఈ కొత్త తరహా సీక్రెట్ కెమెరాలను ఏఐతో అనుసంధించనున్నారు. ఇవి మహిళల ముఖ కవళికలు, వారిలో మారుతున్న వ్యక్తీకరణలను గుర్తిస్తాయి. అంతేగాక ఎవరైనా మహిళ ఆందోళనగా ఉన్నా... ఒత్తిడి తో ఉన్నా అవి ఇట్టే పసిగట్టేస్తాయి. సదరు మహిళ ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్ కు హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. మహిళలు అఘాయిత్యాల భారిన పడకుండా కాపాడతారు. అంతేగాక వీటి ద్వారా నేరగాళ్లను పట్టుకోవడం కూడా సులువవుతుంది. ఈవ్ టీజింగ్ కేసులు కూడా తగ్గుముఖం పడతాయని అధికారులు చెబుతున్నారు.
Published by:Srinivas Munigala
First published:January 21, 2021, 17:40 IST