హైకోర్టు సంచలన నిర్ణయం, ఏకంగా సీఎం ‘అవినీతి’పై సీబీఐ విచారణ

ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టులో రెండు వేర్వేరు రిట్ పిటిషన్ల (క్రిమినల్) ను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మీద అవినీతి ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: October 28, 2020, 4:54 PM IST
హైకోర్టు సంచలన నిర్ణయం, ఏకంగా సీఎం ‘అవినీతి’పై సీబీఐ విచారణ
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ (File/Image;Twitter))
  • Share this:
ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌ మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద సీబీఐ విచారణకు ఆదేశించింది. ఓ జర్నలిస్ట్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 27, 2020న హైకోర్టు జడ్జి జస్టిస్ రవీంద్ర మైథాని ఈ మేరకు ఆర్డర్స్ జారీ చేశారు. ‘జర్నలిస్ట్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ లోని పారా 8లో ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.’ అంటూ డెహ్రాడూన్‌లోని సీబీఐ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం కేసును విచారించిన వెంటనే పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టులో రెండు వేర్వేరు రిట్ పిటిషన్ల (క్రిమినల్) ను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఉమేష్ శర్మ, శివ ప్రసాద్ సేమ్ వాల్ ఇద్దరూ పలు ఆరోపణలు చేశారు. తమ మీద పెట్టిన కేసులను కొట్టేయాలని కూడా అందులో వారు కోరారు. ఈ ఏడాది జూలైలో వారి మీద డెహ్రాడూన్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందులో చీటింగ్ కేసు కూడా ఉంది.

ఉమేశ్ శర్మ అనే జర్నలిస్టు రిలీజ్ చేసిన వీడియోలో చేసిన ఆరోపణలు ఏంటంటే, 2016 సంవత్సరంలో అప్పటి జార్ఖండ్ బీజేపీ ఇన్ చార్జిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ రాష్ట్రంలోని గో సేవా ఆయోగ్ పథకం చీఫ్‌గా ఓ వ్యక్తిని నియమించడానికి త్రివేంద్ర సింగ్ రావత్ బంధువులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఆరోపించారు. అది త్రివేంద్ర సింగ్ రావత్ అమోదంతోనే జరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో గత జూలైలో ఇద్దరు జర్నలిస్టుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే అదేం నేరం కాదు. ప్రభుత్వ వ్యవస్థలు విమర్శలను స్వీకరించగలిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ప్రజాస్వామ్యంలో అనంగీకారాన్ని కూడా గౌరవించాలి, పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ విమర్శలను చట్టాలతో తొక్కేస్తే, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం కిందే భావించాలి. ’ అని కోర్టు అభిప్రాయపడింది. ప్రత్యేకించి జర్నలిస్టుల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సెక్షన్ 124-a (ipc) నమోదు చేయడం అంటే విమర్శించే వారి గొంతును నొక్కేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. అలాంటి దాన్ని తాము ఎప్పటికి ఆమోదించబోమని కోర్టు స్పష్టం చేసింది. ‘చట్టం దాన్ని అంగీకరించదు. పిటిషనర్ల మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, వాటికి సెక్షన్ 124-a (ipc)తో ఏ మాత్రం సంబంధం లేదు. ఎందుకు ఈ సెక్షన్ పెట్టారు? ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వాదనకు ఏ మాత్రం పసలేదు.’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఉత్తరాఖండ్ సీఎం చిక్కుల్లో పడ్డారు. ఆయన మీద సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరపనుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 28, 2020, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading