Golu Devta : న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కో, కోర్టుకో వెళ్తారు! అవును ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌లో కొందరు ప్రజలు మాత్రం ఓ దేవాలయానికి న్యాయం కోసం వెళ్తారు. పోలీస్‌స్టేషన్‌లో అర్జీ పెట్టినట్లుగానే.. అక్కడి ఆలయంలోని దేవతకు లేఖ ద్వారా తమ కోరికను తెలియజేస్తారు. అక్కడి దేవత ఎంత ప్రసిద్ధి అంటే.. విదేశాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ఇంతకీ అక్కడి దేవత న్యాయం చేస్తుందా? లేదా? అని ఆలోచిస్తున్నారా? ఆ ఆలయంలో పోగై ఉన్న లేఖలను చూస్తే మీకూ నమ్మాలనే అనిపిస్తుంది మరి. ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోలు దేవతకు న్యాయదేవతగా పూజలు
ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. భక్తులు సంతానం ఇచ్చే దేవుడిగా భావించి కొందరిని కొలుస్తుంటే, ఆరోగ్యం ప్రసాదించే దైవంగా మరికొందరు దేవతలను విశ్వసిస్తారు. అక్కడ పూజలు చేస్తే కోరుకున్నవి తీరుతాయని భావిస్తారు. ఆయా గుడులకు సంబంధించిన ప్రత్యేక ఆచారాలను పాటిస్తూ మొక్కులు తీరుస్తుంటారు. ఇలాంటి ఓ ఆలయమే ఉత్తరాఖండ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లో గోలు దేవత(గోలజ్యు మహారాజ్)ని న్యాయ దేవతగా భావిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గోలు దేవత ఆలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాల కంటే అల్మోరాలో ఉన్న చిటైస్ గోలు దేవత ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో తమకు న్యాయం జరుగుతుందని ఉత్తరాఖండ్ ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఆలయ ప్రాంగణమంతా గంటలే!
చితాయ్ దేవాలయం అల్మోరా నగరానికి 8 కిలో మీటర్ల దూరంలో పిథోరఘర్ హైవేపై ఉంది. సాధారణంగా ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో గోలు దేవతకు లేఖ ద్వారా తమ సమస్యను వివరిస్తే న్యాయం లభిస్తుందని భక్తుల నమ్మకం. నిత్యం ప్రజలు తమ సమస్యలను లేఖల రూపంలో గోలు దేవత ముందు ఉంచుతుంటారు. అందుకే ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో లేఖలు, గంటలు కనిపిస్తాయి. వెంటనే న్యాయం అందించే దైవంగా గోలు దేవతను స్థానికులు కొలుస్తారు. రాజవంశ కులదైవంగా గోలు దేవతను పేర్కొంటారు. ఈ దేవతను ఉత్తరాఖండ్‌లో చాలా పేర్లు ఉన్నాయి, వాటిలో ఒకటి గౌర్ భైరవ్. విశ్వాసాల ప్రకారం.. ప్రజలు గోలు దేవతను శివుని అవతారంగా చూస్తారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోరికలను లేఖపై రాసి ఆలయ ప్రాంగణంలో ఉంచుతారు. లేదా తీగ సహాయంతో వేలాడదీస్తారు. భక్తులు తమ కోరికలు తీరినప్పుడు ఆలయానికి గంటను సమర్పిస్తారు. ఈ ఆలయానికి ఉత్తరాఖండ్ నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ప్రజలు వస్తుంటారు. ఆలయంలో పెద్ద సంఖ్యలో లేఖలు, గంటలు కనిపిస్తుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.