Oxygen : ఇదెక్కడి దారుణం సామీ.. ఉచితంగా ఆక్సిజన్ అందిస్తోన్న యువకుడిపైనే కేసు పెట్టారుగా..

ప్రతీకాత్మక చిత్రం

Oxygen : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆక్సిజన్​ కొరత మాత్రం తీరడం లేదు. దీంతో కొంత మంది దాతలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారిని యావత్​ దేశం ప్రశంసలతో ముంచెత్తుతుంది. అయితే ఇలా సాయం చేసిన వారిని మెచ్చుకోవాల్సింది పోయి..

  • Share this:
కరోనా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో ఆక్సిజన్​ లభించక కోవిడ్ రోగులు చనిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆక్సిజన్​ కొరత మాత్రం తీరడం లేదు. దీంతో కొంత మంది దాతలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారిని యావత్​ దేశం ప్రశంసలతో ముంచెత్తుతుంది. అయితే ఇలా సాయం చేసిన వారిని మెచ్చుకోవాల్సింది పోయి.. ఉత్తరప్రదేశ్​ పోలీసులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని జౌన్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్​ కొరత కారణంగా కరోనా రోగులు అవస్థలు పడుతున్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న విక్కీ అగ్రహారి అనే యువకుడు వారికి సహాయం చేయాలనుకున్నాడు. తన సొంత డబ్బులతో ఆక్సిజన్​ సిలిండర్లను కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా అందిస్తున్నాడు. ఇలా మానవత్వంతో సాయం చేస్తున్న ఈ యువకుడికి పోలీసులు రూపంలో చేదు అనుభవం ఎదురైంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నాడని ఆసుపత్రి మెడికల్​ సూపరింటెండెంట్​ సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విక్కీ కోవిడ్​–19 పరీక్ష చేయించుకోకుండా, శానిటైజ్​ చేయకుండా రోగులకు అసురక్షిత పద్ధతిలో ఆక్సిజన్​ అందిస్తున్నాడని సూపరింటెండెంట్ ఆరోపించారు. కోవిడ్ –19 మార్గదర్శకాలను పాటించడం లేదని, ఇది కరోనా సంక్రమణ వ్యాప్తికి దారితీస్తుందని​ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సూపరింటెండెంట్​ ఫిర్యాదు మేరకు పోలీసులు విక్కీ అగ్రహారిపై భారత శిక్షాస్మృతిలోని 188, 269 సెక్షన్లు, ఎపిడెమిక్ డిసీజెస్ చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

పోలీసులపై నెటిజన్ల ఆగ్రహం..
ఏప్రిల్ 29న జౌన్‌పూర్ జిల్లా ఆసుపత్రి వెలుపల వేచి ఉన్న రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసిన విక్కీ.. ఒక్క రోజులోనే దాదాపు 25 నుంచి 30 మంది రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించానని చెప్పాడు. మానవత్వంతో తాను చేస్తున్న సేవలను గుర్తించాల్సింది పోయి.. ఇలా కేసు పెట్టడం దారుణమని వాపోయాడు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​ అయింది. ఈ విషయంలో నెటిజన్లు విక్కీకి సపోర్ట్​ చేస్తూ.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సంక్షోభాన్ని తీర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్న విక్కీ లాంటి వ్యక్తులకు సపోర్ట్​ చేయాల్సింది పోయి.. కేసులు నమోదు చేయడం దారుణమని పోలీసులను ట్రోల్ చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: