UTTAR PRADESH HUSBAND DIED IN BUS CONDUCTOR GET OFF THE FAMILY FROM THE BUS ON THE WAY NK
యూపీలో దారుణం... భర్త చనిపోయాడని బస్సు నుంచీ దింపేశారు...
ప్రతీకాత్మక చిత్రం
ఎవరైనా భర్త చనిపోయిన బాధలో ఉంటే... చుట్టుపక్కల వాళ్లు ఓదార్చుతారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆ కండక్టర్ మాత్రం ఓదార్చలేదు సరికదా... అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ భార్యా భర్తలు... బహ్రైచ్ నుంచీ... లక్నోలోని బంధువుల ఇంటికి యూపీ ప్రభుత్వ రవాణా బస్సులో బయలుదేరారు. జర్నీ కాస్త ఎక్కువ దూరమే ఉండటంతో... ఆ జంట ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇతర ప్రయాణికులు కూడా... ఎవరి మాటల్లో వాళ్లు మునిగిపోయారు. అంతలోనే... ఆ భర్త ఉన్నట్టుండి... ఎదురుగా ఉన్న సీటుపై వాలిపోయాడు. ఆయనకు నిద్ర వస్తుందేమో అనుకుందామె. భర్తను కదిపి... నిద్ర వస్తోందా అని అడిగింది. కానీ అతను కదల్లేదు. మరోసారి కదిపింది. అప్పుడూ అంతే. ఈసారి గట్టిగా కదిపి... వెనక్కి లాగి చూసింది. ఉలుకూ, పలుకూ లేదు. ఆమెలో ఆనందం ఆవిరైంది. ఒక్కసారిగా భయం ఆవహించింది. ఏవండి... ఏమైందండీ అంటూ గట్టిగా మాట్లాడుతూ... భర్తను అటూ ఇటూ కదిపింది. వెంటనే మిగతా ప్రయాణికులు ఏంటా అని చూశారు. వాళ్లూ ప్రయత్నించారు. అప్పుడు అర్థమైంది అందరికీ... ఆయన చనిపోయాడని.
అప్పటిదాకా ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ బస్సులో ప్రయాణం చేశారు. ఇంతలో ఏమైందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఆమె కన్నీళ్ల సంద్రమైంది. మిగతా ప్రయాణికులు ఆమెను ఎంత ఓదార్చుతున్నా... ఆమె కన్నీళ్లు ఆగట్లేదు. దాంతో ప్రయాణికులు కూడా అయ్యో పాపం అంటూ జాలిగా చూశారు. ఇంతలో అక్కడికొచ్చిన కండక్టర్... ఏంటీ చనిపోయాడా... మరి ఇంకా బస్సులోనే తీసుకెళ్తున్నారేంటి... కుదరదు... అంటూ వెంటనే బస్సు ఆపించేశాడు. దిగాలి... దిగాలి... అంటూ హడావుడి చేశాడు.
మిగతా ప్రయాణికులు "అదేంటి వాళ్లు లక్నో వరకూ టికెట్ తీసుకున్నారు కదా" అంటే... కావచ్చు... కానీ అతను చనిపోయాడు కదా... రూల్స్ ఒప్పుకోవు. చనిపోయిన వాళ్లతో బస్సు నడపకూడదు... అంటూ నాటకాలాడాడు. ఆ పరిస్థితుల్లో... కన్నీళ్ల మధ్యే భర్తతో సహా నడిరోడ్డుపై బారాబంకిలోని... రామ్ నగర్ క్రాసింగ్ దగ్గర దిగింది ఆ ఇల్లాలు. బస్సు ఎక్కినట్లు సాక్ష్యం ఉండకూడదనుకున్న కండక్టర్... టికెట్ కూడా చించేశాడు. ఇదంతా చూసిన స్థానికులు బస్సు నంబర్ రాసుకొని... బారాబంకి డిపో ఇంఛార్జి మనోజ్‌కుమార్‌కి కంప్లైంట్ ఇచ్చారు. జరిగింది తెలుసుకొని షాకైన మనోజ్‌కుమార్... కచ్చితంగా కండక్టర్, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.