ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ మళ్లీ బీజేపీ ఖాతాలో పడటం దాదాపు లాంఛనమే. ఇక్కడ బీజేపీకి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందన్న అంచనాలన్నీ వీగిపోయాయి. 2017 తరహాలోనే మరోసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ కూటమి బీజేపీకి ఏ దశలో ధీటైన పోటీ ఇవ్వలేకపోయింది. ఆధిక్యంలో బీజేపీ(BJP) దూసుకుపోగా.. సమాజ్‌వాదీ కూటమి ఆధిక్యం 100 సీట్లు దాటేందుకు ఇబ్బందిపడినట్టు కనిపించింది. బీజేపీ ఆధిక్యం 250 స్థానాలకు పైగా ఉండటంతో.. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. కేంద్రంలో మోదీ(Narendra Modi) ప్రభుత్వంలో, యూపీలోని యోగి ప్రభుత్వం కలిసి ఉత్తరప్రదేశ్‌ను(Uttar Pradesh) అభివృద్ధి చేస్తున్నారనే వాదనకు మెజార్టీ రాష్ట్ర ప్రజలు జై కొట్టారు. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కడం ఖాయమైనప్పటికీ.. మరోసారి బీజేపీ 300 సీట్లు మార్క్ దగ్గరకు చేరుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్(Yogi AdityaNath) కొత్త చరిత్ర సృష్టించారు. 37 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి ఒక పార్టీ అధికారంలోకి రావడంతో పాటు రెండోసారి(ప్రస్తుతం సీఎం యోగి ఆదిత్యనాథ్) ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చివరిసారిగా 1985లో కాంగ్రెస్ పాలన సాగింది. అప్పట్లో కాంగ్రెస్‌కు వీర్ బహదూర్ సింగ్ నాయకత్వం వహించారు.
నారాయణ్ దత్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ 1980 నుంచి వరుసగా ఐదేళ్లు పాలించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అయితే ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. యూపీని ములాయం సింగ్ యాదవ్, కళ్యాణ్ సింగ్, రాంప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి, అఖిలేష్ యాదవ్, చివరకు యోగి ఆదిత్యనాథ్ పాలించారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఎవరూ సాధించలేనిది సాధించారు. ఆయన సారథ్యంలోనే బీజేపీ రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రానుంది.
యోగి ఆదిత్యనాథ్ తన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో తన ప్రజాదరణను కొనసాగించారు. చాలా అనిశ్చితి మధ్య ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. మంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పార్టీని వీడి ప్రతిపక్షంలో చేరారు. అయితే సంక్షోభం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ఏమాత్రం వెనుకాడకుండా ఎన్నికల్లో పార్టీని నడిపించారు. అతను చివరికి గొప్ప విజయాన్ని సాధించారు.
మరోసారి మోడీ-యోగి మ్యాజిక్ పర్ఫెక్ట్‌గా పని చేసిందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల సరళి బట్టి అర్థమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అభివృద్ధి పనులే ఓటింగ్‌లో కీలకంగా నిలిచాయి. గత ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో వైద్య కళాశాలలు, మెరుగైన రవాణా సౌకర్యాలు, కొత్త విమానాశ్రయం వాస్తవమయ్యాయి. అభివృద్ధి పనులతోపాటు అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులను కూడా మోదీ-యోగి కూటమి ప్రారంభించగలిగింది. ఇది కూడా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh