UP Elections 2022: యూపీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు వారికే.. ప్రియాంకా గాంధీ ప్రకటన..

ప్రియాంకా గాంధీ వాద్రా (File)

Priyanka Gandhi - UP election News | ‘రాబోయే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తాం. కేవలం కులం, మతం ప్రాతిపదికన కాకుండా కేవలం ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా వారికి టికెట్లు కేటాయిస్తాం.’ అని ప్రియాంకా గాంధీ ప్రకటించారు.

 • Share this:
  ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (UP Assembly Elections 2022) ముందు కాంగ్రెస్ పార్టీ (Congress Party) జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కీలక ప్రకటన చేశారు. లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే ఉత్తర్ ప్రదేశ్ (UP Elections) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 40 శాతం సీట్లను (40 Percent seats for Women) కేటాయిస్తుందని ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆమే ఇన్ చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటన సంచలనంగా మారింది. ‘రాబోయే ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తాం. కేవలం కులం, మతం ప్రాతిపదికన కాకుండా కేవలం ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా వారికి టికెట్లు కేటాయిస్తాం.’ అని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. 2022 లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. దేశ రాజకీయాల్లో క్రియాశీలక మార్పునకు ఇది శ్రీకారం చుడుతుందని ప్రియాంకా గాంధీ అన్నారు.

  ప్రస్తుతం మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తున్నామని, ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో 50 శాతం సీట్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. ‘మహిళలు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రంలో ద్వేష రాజకీయాలను మహిళలను అంతం చేయగలరు.’ అని ప్రియాంకా గాంధీ అన్నారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 7 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే, ఈ సారి గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది.

  ఓడిన రాహుల్ కంటే ప్రియాంక గాంధీనే ప్రియం -కానీ చెల్లెలంటే అన్నకు భయం -ముందే జారుకుంటోన్న మిత్రులు  కుల రాజకీయాలు రాజ్యమేలే చోట మహిళా కార్డును ప్రయోగించిన కాంగ్రెస్

  కుల రాజకీయాలు బలంగా ఉన్న యూపీలో అన్ని పార్టీలు కూడా కుల సమీకరణాలను బేరీజు వేసుకుని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంటాయి.  సమాజ్ వాదీ పార్టీ యాదవ సామాజికవర్గం, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ దళితుల ఓట్ బ్యాంక్‌ను కాపాడుకునేందుకు, వారి మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఇతర వర్గాలను , ముఖ్యంగా బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. కులాలు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు టికెట్లు ఇస్తామని ప్రకటించడం ద్వారా గంపగుత్తగా మహిళల మనసు గెలుచుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

  పోలీసుల నిర్బంధంలో ప్రియాంక గాంధీ సత్యాగ్రహం -తనను ఉంచిన గదిలో చీపురు పట్టి ఇలా   ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ప్లాన్

  గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని చాలా ముందు నుంచే ప్లాన్ చేస్తోంది. ఆ బాధ్యతను ప్రియాంకా గాంధీ వాద్రా తన భుజాలపై మోస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఆమె వినియోగించుకుంటున్నారు.

  BJP: బీజేపీలో చిచ్చుపెట్టిన లఖీంపూర్ ఘటన.. వరుణ్ గాంధీ, మేనకకు హైకమాండ్ షాక్  లఖీంపూర్ ఘటన తర్వాత ప్రియాంకా గాంధీకి మైలేజీ

  ఇటీవల లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన వాహనం దూసుకెళ్లిన ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసమయంలో ప్రియాంకా గాంధీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా యూపీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే, తనను నిర్బంధించిన ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో ఆమె చీపురుతో ఊడ్చి తన నిరసన తెలిపారు. ఆ వీడియో కాంగ్రెస్ పార్టీకి మైలేజీని తీసుకొస్తే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: