Black Fungus: బ్లాక్ ఫంగస్ ఇలా కూడా వచ్చే ప్రమాదం ఉందట.. జాగ్రత్తగా ఉండండి

ప్రతీకాత్మక చిత్రం

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ రావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందులో ఒకటి శుభ్రమైన మాస్క్‌లు ధరించకపోవడం, రెండోది వెంటిలేషన్‌ సరిగ్గా లేని ఇళ్లలో ఉండటం.

  • Share this:
కరోనా బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మాస్క్‌ ధరించడం ఒకటి. చాలా రోజులుగా వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఇదే. అయితే ఇకపై ఆ మాటలో చిన్న మార్పు చేయాల్సి వస్తుందేమో. అదేంటంటే ‘శుభ్రమైన మాస్కలు ధరించండి’, లేదా ‘మాస్క్‌లను జాగ్రత్తగా శుభ్రపరచండి’. ఎందుకంటే బ్లాక్‌ ఫంగస్‌ రావడానికి శుభ్రంగా లేని మాస్క్‌లు కూడా ఓ కారణమని వైద్యులు చెబుతున్నారు. కరోనాతోనే ప్రజలు భయపడుతున్నారు అనుకుంటే... ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ ఒకటి వచ్చింది. దీని వల్ల కంటిచూపు పోవడం, తీవ్రమైన అనారోగ్యం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల కేంద్రం కూడా దీనిని నోటిఫైడ్‌ వ్యాధిగా దీనిని ప్రకటించింది. అయితే ఇది కరోనా వచ్చి తగ్గినవాళ్లలోనే కనిపిస్తోంది. అలా అని ఇది అంటువ్యాధి అని చెప్పలేదు కానీ కొన్ని రాష్ట్రాల్లో అలానే అంటున్నారు. అయితే బ్లాక్‌ ఫంగస్‌ రావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందులో ఒకటి శుభ్రమైన మాస్క్‌లు ధరించకపోవడం, రెండోది వెంటిలేషన్‌ సరిగ్గా లేని ఇళ్లలో ఉండటం.

దిల్లీలోని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు ఈ శుభ్రం లేని మాస్కుల విషయాన్ని ప్రస్తావించారు. వాడిన మాస్కునే మళ్లీ వాడటం, సరైన రీతిలో శానిటైజ్‌ చేయకపోవడం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశం ఉందట. అయితే మరికొంతమంది వైద్యులు మాత్రం స్టెరాయిడ్స్‌ను అమితంగా వాడటం వల్ల బ్లాక్‌ ఫంగర్‌ వస్తుందని అంటున్నారు. దీంతో ఈ విషయంలో స్పష్టత కొరవడింది. అయితే శుభ్రం చేసిన మాస్క్‌లు వాడటం ఎప్పటికైనా మంచిది కాబట్టి... ప్రజలు ఆ దిశగా ఆలోచించడం మంచిది అని పలువురు సూచిస్తున్నారు.

మాస్క్‌ పెట్టుకోమన్నారు కదా అని, ఏది పడితే అది పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం మంచిది. మరోవైపు డబుల్‌ మాస్క్‌ మంచిది అని కూడా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో ఒక్కొకరు రెండేసి సెట్ల మాస్క్‌లు వినియోగించడం ఉత్తమం. దీంతోపాటు ఒకవేళ ఆక్సిజన్‌ వాడుతున్నవాళ్లు అయితే కాన్సన్‌ట్రేటర్ల హ్యుమిడిఫయర్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీంతోపాటు ఇంట్లోకి బయట గాలి బాగా వచ్చేలా వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.

బ్లాక్‌ ఫంగస్‌ సోకినవారికి ముక్కు, కళ్ల ప్రాంతంలో ఎరుపుదనం కనిపిస్తుంది. చిన్నపాటి జ్వరం కూడా వస్తుంది. ముక్కు రంధ్రాల నుండి రక్తం కారడం లాంటివి కూడా జరుగుతాయి. తలనొప్పి, జలుబు, ఊపిరి పీల్చుకోవడంలో సమస్య, రక్త వాంతులు, స్వల్పంగా కంటిచూపు తగ్గడం లాంటివి వస్తాయి. ప్రస్తుతం దేశంలో బ్లాక్‌ఫంగస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో బ్లాక్‌ఫంగస్‌ సోకుతుండటంతో ప్రజలు మరింత బెంబేలెత్తిపోతున్నారు.
First published: