news18-telugu
Updated: February 19, 2020, 7:01 AM IST
తాజ్ మహల్‌ను సందర్శించనున్న ట్రంప్ దంపతులు
భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఈ నెల 24న తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. తన సతీమణితో కలిసి ఆయన ప్రేమ చిహ్నాన్ని చూడనున్నారు. దీంతో ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ రూట్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. తాజ్ పరిసర ప్రాంతాలను సుందరంగా మార్చేస్తున్నారు. ఆగ్రా పట్టణంలోని ప్రముఖ కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తాజ్ చుట్టూ ఉన్న గోడలపై వెరైటీ పెయింటింగ్స్ వేస్తున్నారు. ట్రంప్ రాక నేపథ్యంలో అమెరికా భద్రతా బలగాలు ఇప్పటికే తాజ్‌మహల్‌ను సందర్శించాయి. కాగా, ఈ నెల 24న ట్రంప్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఢిల్లీలో ట్రంప్ భారత పార్లమెంటుపై ప్రసంగించనున్నారు. ఢిల్లీలో బస చేసిన తర్వాత ఆగ్రాకు బయల్దేరతారు. అక్కడ తాజ్‌ను సందర్శించి తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు.
ట్రంప్ రాక నేపథ్యంలో అహ్మదాబాద్ నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త రోడ్లు, రోడ్ల మరమ్మతుకు రూ.80 కోట్ల రూపాయలు, ట్రంప్ భద్రతకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్లు వెచ్చిస్తున్నారు. మోటేరా స్టేడియంలో దాదాపు లక్ష మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రూ.7 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్ల మధ్యలో ఈత జాతి చెట్ల ఏర్పాటుకు రూ.6 కోట్లు, మోదీ-ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.4 కోట్లను ఖర్చు చేయనున్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 19, 2020, 6:53 AM IST