ఈ మధ్య కాలంలో విమానంలో అడ్డదిడ్డమైన, అర్థంలేని, అడ్డగోల పనులు చేయడం పెరిగిపోతోంది. తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలపై ఓవైపు రచ్చ కొనసాగుతుండగానే ఎయిర్‌ఇండియా విమానంలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 11న లండన్ నుంచి ముంబై వస్తున్న విమానంలో భారత సంతతికి చెందిన, అమెరికాన్ పౌరుడు రమాకాంత్ బాత్రూమ్‌లో పొగతాగుతూ సిబ్బందికి చిక్కాడు. విమానంలో సిగరేట్ తాగకూడదని సిబ్బంది చెబుతున్నా వినకుండా రివర్స్‌లో మాట్లాడాడు. అంతటితో ఆగలేదు..
విమానం డోర్ తీస్తానంటూ బెదిరింపు:
బాత్‌రూమ్‌లో సిగరెట్ తాగొద్దన్నందుకు క్యాబిన్ సిబ్బందిపై చిందులేశాడు రమాకాంత్.. అంతేకాదు విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. తన తోటి ప్రయాణికులతో అతడు అనుచితంగా ప్రవర్తించాడు. రమాకాంత్‌ను అదుపు చేయడం క్యాబిన్ సిబ్బంద వల్ల కాలేదు. ఎంత నచ్చ చెబుతున్నా రమాకాంత్ అసలు వినిపించుకోలేదు.. ఏదో పిచ్చి పట్టినవాడిలా అరవడం.. విమానం డోర్ తీస్తానంటూ బెదిరించడం.. వేగంగా విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించడం.. ఇలా ఒకటేమిటి విమానంలో ఉన్నంత సేపు రచ్చ రచ్చ చేశాడు రమాకాంత్. అంతేకాదు.. తన బ్యాగులో బుల్లెట్ కూడా ఉందని బెదిరించాడు. అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు అతడి బ్యాగులో దొరకలేదు. ఈ క్రమంలో రమాకాంత్‌పై సహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రమాకాంత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది తేల్చేందుకు బ్లడ్ శాంపిల్ సేకరించి, పరీక్షలకు పంపించారు.
ఇటివల పెరిగిపోతున్న పిచ్చి చేష్టలు:
ఎయిర్ ఇండియా విమానంలో మూత్ర విసర్జన ఘటనలు చాలా జరుగుతున్నాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వ్యక్తి పక్కనే ఉన్న మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడం సరిగ్గా వారం క్రితమే జరిగింది. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి మద్యం మత్తులో నిద్రలో ఉన్న సమయంలో మూత్రం పోశాడు. ఆ మూత్రం పక్కనే ఉన్న తనపై పడ్డట్టు తోటి ప్రయాణికుడు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. విమాన సిబ్బంది పైలెట్ ద్వారా ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని ఏటీసీకి తెలియజేశారు. విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇక గత నవంబర్‌లో శంకర్ మిశ్రా అనే భారతీయుడు సహ ప్రయాణికురాలిపై మూత్రం పోయడం కలకలం రేపింది. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినట్టు రుజువైతే నిందితులపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. నిందితులపై విమానప్రయాణాలు చేయకుండా కొంతకాలం పాటు నిషేధం విధిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Smoking habbit