ప్రపంచంలోని వివిధ దేశాలలో, దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిల్లో ఇండో-పాక్ సరిహద్ధు వివాదం కూడా ప్రధానమైనదే. ఇరు దేశాల మధ్య ఉన్న విరోధం అంతర్జాతీయంగా ప్రతిసారీ చర్చకు వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో భయాందోళనలు కలిగించే పరిస్థితులపై అమెరికా వార్షిక అంచానాల వివరాలను ఆ దేశం మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగానే అమెరికా ఇంటలిజెన్స్ కమ్యూనిటీ కొన్ని విషయాలను వెల్లడించింది.
ప్రపంచంలో ఉన్న చాలా వివాదాల్లో భారతదేశానికి, పాకిస్థాన్‌కి మధ్య ఉన్న సరిహద్దు వివాదం నానాటికీ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అమెరికా ప్రస్తావించింది. ఒకవైపు రెండు దేశాలు తమ మిలటరీ దళాలను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇరు దేశాల మధ్య యుద్ధం అసంభవమే అయినా ఆందోళనకర పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. దీనికి తోడు భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఎన్నికైనప్పటి నుంచి.. పాకిస్థాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడల్లా గతంలో కంటే ఇప్పుడు ఇండియా మిలటరీ ఫోర్స్‌తో సమాధానం చెప్పడానికి వెనుకాడడం లేదు. అంతేకాదు, అణ్వాస్త్రాలు కలిగి ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే మరింత వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తుంది. అందులోనూ కాశ్మీర్‌లో హింస వల్ల పెరుతున్న అశాంతి, అసహనం, తరచుగా జరుగుతున్న మిలిటెంట్ల దాడుల కారణంగా పరిస్థితి మరింత ముదురుతోంది.
ఇక అమెరికాకు సంబంధించి, చైనా తమకు అన్ని విషయాల్లోనూ పోటీదారుగా ఉందని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ చెబుతోంది. 'చైనా బహుళ రంగాల్లో అమెరికాను సవాలు చేస్తోంది. ఇక రష్యా కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసే దిశగా, బలప్రయోగంతో పాటు సాంకేతికంగా ఎదుర్కునే దిశగా వాషింగ్టన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇరాన్ కూడా విస్తృతంగా హానిచేసే కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ ప్రాంతీయ భయంగా మారిందని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యునిటీ అభిప్రాయపడింది. చివరిగా, ఉత్తర కొరియా కూడా ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అశాంతిని నెలకొల్పే పనులు చేస్తున్నట్లు వీళ్లు ప్రకటించారు.
''చైనా తన బలాన్ని చూపించి, పొరుగు దేశాలు బీజింగ్ అధికారాన్ని ఒప్పుకొని, తాము చెబుతున్న ప్రకారం నడుచుకునే విధంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం వివాదపూరితమైన సరిహద్దు అంశాల్లో దూకుడుగా వ్యవహారిస్తుంది. తైవాన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. ఇండో-చైనా సరిహద్దులో కొంత మేరకు బలగాలను ఉపసంహరించుకుంటున్నా ఆందోళనలు పెంచడంలో దూకుడు ప్రదర్శిస్తోంది.'' అని డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ప్రకటించింది.
భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న అమెరికా చైనా దూకుడును బలంగా వ్యతిరేకించింది. అందుకే ఇండియా అభ్యర్థన మేరకు మిలటరీ సహాయాన్ని అందించడానికి కూడా సంసిద్ధమయ్యింది. ఇండియా పొరుగు దేశాలకు సంబంధించి, మయాన్మార్ మిలటరీ అధికారాన్ని ఫిబ్రవరిలో సీజ్ చేయడం, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సన్ సూకీని తొలగించడం, ఏడాది పాటు ఎమర్జన్సీ డిక్లేర్ చేయడం వంటివి ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమే. చైనా అక్కడ సామాజిక అస్థిరతను పెంచి, నిరసనలకు కారణం అవుతున్నారని రిపోర్టు వెల్లడించింది.
ఇక ఆఫ్ఠనిస్థాన్ విషయంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది శాంతి చర్చలు కొనసాగే అవకాశం లేనట్లు కనిపిస్తుందని అన్నారు. యుద్దంలో తాలిబాన్లు లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారని, సంకీర్ణ ప్రభుత్వం లేకపోతే తాలిబాన్లను ఆఫ్ఘాన్ ప్రభుత్వం నిలువరించలేదని ఈ రిపోర్డులో అమెరికా ఇంటలిజెన్స్ కమ్యూనిటీ స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.