23 ఏళ్ల వయసులో అత్యాచారం కేసు.. 20ఏళ్ల పాటు జైలు జీవితం.. నిర్దోషిగా హైకోర్టు తీర్పు.. నా చేతిలో ఉన్నది రూ.600 మాత్రమేనంటూ..

జైలు నుంచి విడుదల అయిన విష్ణు తివారీ (Image Credit: Twitter)

23 ఏళ్ల వయసులో నన్ను జైల్లో పెట్టారు. తప్పుడు కేసులు బనాయించారు. 20 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిర్దోషివంటూ తీర్పునిచ్చి నన్ను బయటకు వదిలేశారు. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. నాకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు..

 • Share this:
  ‘నా జీవితంపై నాకు ఆశలు లేవు. నా అన్న వాళ్లు నాకు ఎవరూ లేరు. ఒకటి కాదు రెండు కాదు ఈ 20 ఏళ్లల్లో నా సంపాదన అక్షరాలా 600 రూపాయలు మాత్రమే. చేయని తప్పునకు నేను శిక్ష అనుభవించాను. 23 ఏళ్ల వయసులో నన్ను జైల్లో పెట్టారు. తప్పుడు కేసులు బనాయించారు. 20 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిర్దోషివంటూ తీర్పునిచ్చి నన్ను బయటకు వదిలేశారు. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. నాకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. లాయర్లను పెట్టుకుని పోరాడేంత ఆర్థిక శక్తి కూడా లేదు. ఒక్క తప్పుడు కేసు వల్ల నా జీవితం అంథకారమయింది. ఆ కేసే లేకుంటే హ్యాపీగా పెళ్లి చేసుకునేవాడిని. భార్యాపిల్లలతో సంతోషంగా ఉండేవాడిని. నా తలరాత ఇలా ఏడ్చింది..‘.. ఇదీ ఓ వ్యక్తి ఆవేదన.

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్ పుర్ కు చెందిన విష్ణుతివారిపై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు పెట్టింది. ’నేను పనికి వెళ్లి తిరిగి వస్తుండగా నాపై అతడు అత్యాచారం చేశాడు. నోరుమూసి, గొంతు నొక్కి కింద పడేసి నాపై బలాత్కారం చేశాడు.‘ అంటూ ఆ మహిళ కేసు పెట్టింది. 2000వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఈ కేసులో పోలీసులు విష్ణు తివారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో విష్ణు తివారీ వయసు 23 ఏళ్లు. తాను తప్పు చేయలేదని, నాకేం తెలియదని అతడు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేసు విచారణ సమయంలో మూడేళ్ల పాటు అతడు జైల్లోనే గడిపాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు చివరకు అతడిని దోషిగా తేల్చింది. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం అతడికి జీవిత ఖైదును విధించింది.
  ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

  అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ విష్ణు హైకోర్టుకు వెళ్లాడు. అయితే హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి, తుది తీర్పు వచ్చేసరికి ఏళ్లకు ఏళ్లు గడిచాయి. చివరకు జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ బెంచ్ తివారీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో తుది తీర్పును వెల్లడించింది. ’ఈ కేసులో ఇంత జాప్యం జరగడం శోచనీయం. 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా సంబంధిత శాఖ అతడి గురించి పట్టించుకోకపోవడం నిర్లక్ష్యమే. ఈ కేసులో వాస్తవానికి తగిన ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదు. వైద్యుల రిపోర్టులో అత్యాచారం జరిగినట్టు దాఖలాలు లేవు. ఆమె వద్ద నిందితుడి వీర్యం ఆనవాళ్లు కూడా లేవు. ఆమె గొంతు నొక్కి, కింద పడేస్తే గాయాలయినా కావాలి. ఆ దాఖలాలు కూడా వైద్యుల రిపోర్టులో ఏమీ లేదు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని భావిస్తున్నాం. అతడి తప్పు లేకున్నా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం శోచనీయం‘ అంటూ అలహాబాద్ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది.
  ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

  హైకోర్టు తీర్పు అనంతరం అతడి విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల సమయం పట్టింది. మొత్తానికి ఈ బుధవారం అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. అతడిని స్వాగతించడానికి ఎవరూ లేకపోవడం గమనార్హం. ’జైలుకు వెళ్లే నాటికి నాకు పెళ్లి కాలేదు. మా అమ్మా నాన్న ఆ తర్వాత చనిపోయారు. ఒక్క అన్నయ్య మాత్రమే ఉన్నాడు. కానీ ఆయన కుటుంబం ఆయనది. నా చేతిలో ప్రస్తుతం 600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా జైల్లో సంపాదించినవే. నా హృదయం ముక్కలయింది. ఇక నాకు మిగిలిన జీవితంపై పెద్దగా ఆశలు లేవు.‘ అంటూ విష్ణు తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, నిర్దోషిగా విడుదలయిన తర్వాత బస్సులో సొంతూరికి వెళ్లిన విష్ణుకు ఊహించని అనుభవం ఎదురయింది. అతడికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. గ్రామస్తుల స్పందనతో విష్ణులో కొత్త జీవితం మొదలుపెట్టాలన్న ఆశ కలగడం గమనార్హం.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు
  Published by:Hasaan Kandula
  First published: