ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టడంతో ఎమర్జెన్సీ పైలట్ ల్యాండింగ్ చేశారు. రెండు రోజుల వారణాసి పర్యటన ముగించుకొని సీఎం యోగి ఆదివారం ఉదయం లక్నో బయలుదేరగా, ఆయన హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టడంతో మళ్లీ వారణాసిలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ (CM Yogi's Helicopter Emergency Landing) చేయాల్సి వచ్చింది. వివరాలివి..
యూపీ సీఎం యోగి ఆదిత్యానథ్ ఇవాళ ఉదయం వారణాసి నుంచి లక్నోకు హెలికాప్టర్ లో బయలుదేరారు. వారణాసి పోలీస్ లైన్స్ హెలిప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే చాపర్ ను ఓ పక్షి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో హెలికాప్టర్ కిటికీ అద్దం పగిలిపోయినట్లు తెలుస్తోంది. జాగ్రత్త చర్యల్లో భాగంగా పైలట్ హెలికాప్టర్ ను హుటాహుటిన తిరిగి వారణాసికి మళ్లించి, అదే పోలీస్ లైన్స్ హెలీప్యాడ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత సీఎం యోగి ఎయిర్ పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా లక్నో బయలుదేరానని వారణాసి కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ పేర్కొన్నారు. కాగా, సీఎం హెలికాప్టర్ ను పక్షి ఢీకొన్న ఘటనపై ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదని తెలుస్తోంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం నాడు వారణాసి వచ్చిన సీఎం యోగి.. కాశీవిశ్వనాథుణ్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. సిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. సీఎం హెలికాప్టర్ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, బీజేపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Helicopter, Uttar pradesh, Varanasi, Yogi adityanath