India-China: చైనాపై భారత్ ఎదురుదాడి.. మేం ఒప్పుకోలేదు.. LACపై క్లారిటీ

గత ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రెండు దేశాలు కలిసి ఎల్ఏసీని ధృవీకరించుకోవాలని, అంతేతప్ప భారత్ అంగీకరించని 1959 ఒప్పందం ప్రకారం ప్రాంతాలను తమవిగా చైనా చెప్పుకోవడం అభ్యంతరకరమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: September 29, 2020, 10:26 PM IST
India-China: చైనాపై భారత్ ఎదురుదాడి.. మేం ఒప్పుకోలేదు.. LACపై క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దాదాపు 5 నెలలుగా సరిహద్దుల్లో చెలరేగిపోతున్న చైనా .. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. లద్దాఖ్‌ను భారత కేంద్రపాలిత ప్రాంతంగా తాము గుర్తించడం లేదన బరితెగింపు వ్యాఖ్యలు చేసింది. ఐతే చైనా విదేశాంగ ప్రకటనకు తీవ్రంగా ఖండించిన భారత్.. అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. వాస్తవ నియంత్రణ రేఖ(LAC)కి సంబంధించి చైనా వితండ వాదనను తీవ్రంగా ఖండించింది. లద్దాఖ్‌లోని పలు భూభాగాలు తమవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను మంగళవారం భారత విదేశాంగశాఖ తప్పుబట్టింది.

1959 నాటి ఎల్ఏసీ ఒప్పందం ప్రకారం లడఖ్ లోని పలు భూభాగాలు తమవేనని చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే. ఐతే అసలు ఆ ఒప్పందానికి భారత్ అంగీకరించలేదని, నాటి ఒప్పందం ఇద్దరికీ ఆమోదయోగ్యంగా జరగలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎల్ఏసీ సరిహద్దులను మార్చేందుకు చైనా చాలా కాలంగా నిరంతరంగా ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించింది. ఇదే విషయాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పార్లమెంటులో నివేదించారని ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ప్రస్తావించింది.

LAC అంశంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనలు తొలగించేందుకు భారత్ ప్రయతిస్తుందని.. అదే సమయంలో చైనా మాత్రం ఏకపక్షంగా అనుచిత వైఖరిని ప్రదర్శిస్తోందని భారత్ మండిపడింది. ఎల్ఏసీ వెంబడి శాంతియుతంగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు 1993లో కుదిరిన ఒప్పందం, 1996లో జరిగిన సైనిక రంగంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఒప్పందం(సీబీఎం), సీబీఎం అమలు ప్రోటోకాల్స్‌కు సంబంధించి 2005లో కుదుర్చుకున్న అంగీకారాలను చైనా ఉల్లంఘిస్తూ వస్తోందని విమర్శలు గుప్పించింది. గత ఒప్పందాలు, మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రెండు దేశాలు కలిసి ఎల్ఏసీని ధృవీకరించుకోవాలని, అంతేతప్ప భారత్ అంగీకరించని 1959 ఒప్పందం ప్రకారం ప్రాంతాలను తమవిగా చైనా చెప్పుకోవడం అభ్యంతరకరమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ప్రస్తుత కోవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని సరిహద్దుల్లో దుస్సాహసానికి ఒడిగట్టుతోంది. ఏప్రిల్‌ నుంచి ఎల్ఏసీ వెంబడి చైనా బలగాల కదలికలు పెరిగాయి. అదే సమయంలో మన దేశంలో కోవిడ్ విజృంభించడంతో.. ఆర్మీ యూనిట్లలో వైరస్ విస్తరించకుండా ఉండేందుకు పలు కార్యక్రమాలను ఆర్మీ రద్దుచేసింది. అందులో భాగంగానే లద్దాఖ్‌లో ఆర్మీ ఎక్సర్‌‌సైజ్ రద్దయింది. ఇదే అదునుగా చైనా చెలరేగిపోయింది. పెద్ద మొత్తంలో బలగాలను తరలించి.. భారత్ వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన భారత ఆర్మీ కరోనా విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే, ఎల్ఏసీ వెంబడి సైన్యాన్ని మోహరించింది. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ చోటుచేసుకుంది.

కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అనంతరం సైనికులల్లో మనో స్థైర్యం నింపేందుకు ప్రధాని మోదీ స్వయంగా లద్దాఖ్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇండియా-చైనా మధ్య మిలటరీ స్థాయి చర్చలు జరిగినప్పటికీ.. చైనా తీరు మాత్రం మారలేదు. చర్చలతోనే సమస్యను పరిష్కరించుకుందామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు సరిహద్దుల్లో కవ్విస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 29, 2020, 10:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading