Home /News /national /

UNITED STATES SUPPORTS NEW AGRICULTURE ACTS DONE BY INDIAN GOVERNMENT AK

మోదీ సర్కార్‌కు ఊరట.. కొత్త వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు

జో బైడెన్, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

జో బైడెన్, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

    కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ఓ వైపు రైతులు ఆందోళనలు చేపడుతుంటే.. మరోవైపు పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం కేంద్రానికి కొంత ఇబ్బందిగా మారింది. అయితే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వంటి సంస్థలు కొనియాడాయి. తాజాగా అమెరికా కూడా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్‌ చేపట్టిన చర్యల వల్ల ఇండియన్ మార్కెట్‌ విస్తరిస్తుందని అమెరికా అభిప్రాయపడింది. ఈ చట్టాల కారణంగా ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది.

    భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వ్యవసాయ రంగంలో భారత తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్‌ పరిధి పెరుగుతుందని అన్నారు. శాంతియుత నిరసనలు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి ముఖ్య లక్షణమని అన్నారు. ఎలాంటి విభేదాలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలనే అంశానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాలోని పలువురు ప్రజాప్రతినిధులు రైతుల ఉద్యమానికి మద్దుతు తెలిపారు. భారత్‌లో కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై తీసుకున్న చర్యల గురించి తాను ఆందోళన చెందుతున్నానని యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు హాలే స్టీవెన్స్ అన్నారు. భారత ప్రభుత్వం, రైతు సంఘాలు ప్రతినిధులు చర్చలు ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

    ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు పర్యావరణ ఉద్యమకర్త గ్రెటా థన్‌బర్గ్, పాప్ స్టార్ రిహన్నా లాంటి కొందరు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం సంచలనంగా మారింది. అయితే రైతుల ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు అమెరికా మద్దతు తెలపడం మోదీ సర్కార్‌కు ఊరట కలిగిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Joe Biden, Narendra modi, New Agriculture Acts, USA

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు