news18-telugu
Updated: December 5, 2019, 10:01 PM IST
కేంద్రమంత్రి అశ్వినీ చౌబే
దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయలను కోస్తే కాదు.. ఇప్పుడే వాటి ధరలను చూస్తేనే కన్నీళ్లొస్తున్నాయి. పర్సులకు చిల్లులు పడుతున్నాయి. ఉల్లి ధరలు ప్రస్తుతం 80-100 పలుకుతున్నాయి. ఇక నాణ్యమైన, మంచి సైజులో ఉండే ఉల్లిగడ్డ కావాలంటే కిలోకు రూ.150 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మండుతున్నఉల్లి ధరలపై యావత్ దేశం గగ్గులో పెడుతోంది. ఇవేం ధరలంటూ ప్రభుత్వాలపై ప్రజలు మండిపడుతున్న వేళ.. కేంద్ర మంత్రి చేసిన కామెంట్లు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేను ఉల్లి ధరలపై రిపోర్టర్లు ప్రశ్నలు అడిగారు. దేశంలో ఉల్లి ధరలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో మీకు ఐడియా ఉందా అని ప్రశ్నించారు. వాటిపై స్పందించిన మంత్రి ఆశ్చర్యకర సమాధానం చెప్పారు. ''నేను శాఖాహారిని.. నేను ఎప్పుడూ ఉల్లి రుచి చూడలేదు. అలాంటప్పుడు ఉల్లి ధరల గురించి నాకు ఎలా తెలుస్తుంది?'' అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత గల పదవిలో ఉండి.. ఇలా మాట్లాడతారా అదంటూ మండిపడుతున్నారు.
మరికొందరైతే కేంద్ర మంత్రి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఉల్లిపాయలు ఏమైనా.. మాంసాహారమా..? అంటూ విరుచుకుపడుతున్నారు. మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం లోక్‌సభలో ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎక్కువగా తిననని.. ఉల్లిపాయతో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకొచ్చారు. ఇలా ఉల్లిపై కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల ఉల్లి బాధలపై ప్రభుత్వానికి ఎంత సీరియస్‌గా ఉందో.. ఈ వ్యాఖ్యల బట్టే అర్ధమవుతోందంటూ విరుచుకుపడుతున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 5, 2019, 9:52 PM IST