కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు. కరోనా వైరస్ పూర్తి స్థాయిలో తగ్గి ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు. మన దేశంలో లాక్డౌన్ మూడో వారంలోకి అడుగుపెట్టిందని ఆయన గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని గమనిస్తే పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా 5 నుంచి 6 వారాలు పట్టే అవకాశముందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. రాబోయే గడ్డు పరిస్థితులను ఎదుర్కొని తట్టుకునేందుకు భారతీయులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో ఉన్న కరోనా తీవ్రత.. అక్కడి పరిస్థితులు మన దేశ ప్రజలకు ఎదురుకాకూడదని హర్షవర్ధన్ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మరిన్ని క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ బెడ్స్, ల్యాబ్స్, టెస్టింగ్ కిట్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి కేంద్రమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే... కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఎంత లేదన్నా రెండు నెలల సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.