మరో రెండేళ్లలో భారతీయ రోడ్డు రవాణా వ్యవస్థను ఊహించనిరీతిలో అభివృద్ధి చేస్తామని, 2024 డిసెంబర్ నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని, టూరిజంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్సభలో రోడ్లశాఖపై మాట్లాడుతూ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కామెంట్లు చేశారు. లేహ్, లడాఖ్, శ్రీనగర్లో రోడ్డు కనెక్టివిటీ కోసం కొత్త ప్రాజెక్టులు చేపట్టామని, శ్రీనగర్ నుంచి ముంబై మధ్య 20 గంటల ప్రయాణం జరిగేలా అభివృద్ది చేశామని, ఢిల్లీ నుంచి జైపూర్, హరిద్వార్, డెహ్రాడూన్లకు రెండు గంటల్లో చేరేలా కనెక్టివ్ ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఢిల్లీ నుంచి అమృత్సర్కు నాలుగు గంటలు, ముంబైకి ఆరు గంటల్లో జర్నీ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని, చెన్నై నుంచి బెంగుళూరు మధ్య రెండు గంటల్లో జర్నీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఇన్విట్ ద్వారా పేద ప్రజలే రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇండియా నుంచి నేరుగా మానస సరోవరం వెళ్లేందుకు మార్గాన్ని డెవలప్ చేస్తున్నామని, మరో ఏడాదిలో ఆ రోడ్లు పనులు పూర్తి కానున్నట్లు గడ్కరీ వెల్లడించారు.
ఇండియా ఎనిమిది మూలలనూ కలుపుతూ సాలె గూడు మాదిరిగా రోడ్లను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తోన్న నితిన్ గడ్కరీని ఇకపై స్పైడర్ మ్యాన్ అని పిలవాల్సి ఉంటుందని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావో లోక్ సభలో ప్రశంసలు కురిపించారు. ‘నేను నితిన్ గడ్కరీ పేరును స్పైడర్మ్యాన్గా మార్చాను. స్పైడర్ వెబ్ లాగా... నితిన్ గడ్కరీ దేశంలోని ప్రతి మూలలో విస్తృత రోడ్ల నెట్వర్క్ను వేస్తున్నారు. గడ్కరీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అని కొనియాడారు ఎంపీ తాపిర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Ministry of road transport and highways, Nitin Gadkari, Parliament, USA