కేంద్రమంత్రి పదవికి హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. కేంద్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవిని వదులుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హర్‌సిమ్రత్ కౌర్ భర్త, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్ తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తన వైఖరి స్పష్టం చేసింది. వ్యవసాయ బిల్లులపై గుర్రుగా ఉన్న అకాలీదళ్.. రెండు వ్యవసాయ బిల్లులకు సంబంధించి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం నుంచి బయటకొచ్చి ఎన్డీయేలో కొనసాగుతామని తెలిపింది.
రైతు వ్యతిరేక రాజకీయాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అకాలీదళ్ ప్రకటించింది. తాను కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని.. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిలిచి రైతులకు అండగా నిలవడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా పంజాబ్ ప్రభుత్వాలు 50 ఏళ్లుగా కష్టపడి నిర్మించిన వ్యవసాయ రంగం దెబ్బతింటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో అకాలీదళ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బిల్లు ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రధాని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.