పాట్నా: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బెగుసరై లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ తన నియోజకవర్గంలోని సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు వివాదాస్పద పిలుపునిచ్చారు. చిన్నచిన్న విషయాలకు తన దగ్గరకు ఎందుకు వస్తున్నారని సమస్యలను తన వద్దకు తీసుకెళ్లిన వారిని మంత్రి ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, డీఎంలు, ఎస్‌డీఎంలు, బీడీవోలు.. వీళ్లంతా ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నారని గిరిరాజ్ చెప్పారు. మీ సమస్యలపై వాళ్లెవరూ సక్రమంగా స్పందించకపోతే.. ఓ వెదురు కర్ర తీసుకుని వాళ్ల నెత్తిపై ఒక్కటివ్వడంని ఆయన పిలుపునిచ్చారు. అప్పటికీ వాళ్లు పనిచేయకపోతే మీ వెనుక నేనుంటానని కేంద్ర మంత్రి చెప్పారు.
కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు అక్కడ ఉన్న ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయినప్పటికీ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలపై పాట్నాకు చెందిన బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ... గిరిరాజ్ సింగ్ ప్రజా నేత అని, ప్రజాగ్రహాన్ని వారి ప్రతినిధిగా వ్యక్తపరిచేందుకే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీష్ సమాధానాన్ని దాటవేశారు.
ఈ వ్యాఖ్యలపై స్పందన కోరగా.. వెళ్లి ఆయననే అడగాలని చెప్పారు. కొట్టమని పిలుపునివ్వడం సమంజసమా, కాదా అన్నది ఆయననే అడిగి తెలుసుకోవాలని నితీష్ వ్యాఖ్యానించారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. అసమర్థ సీఎం ఉంటే.. అధికారులు మాట వినరని.. అయితే... కర్రలను తీసుకుని అధికారులపై దాడి చేయమని పిలుపునివ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే మంత్రులకు నితీష్ ప్రభుత్వం రివార్డులు ప్రకటిస్తుందని, నిజాన్ని బయటపెట్టే జర్నలిస్టులపై మాత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుందని తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.