Amit Shah: కుట్రలతో దేశ ప్రగతిని అడ్డుకోలేరు.. విపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్

అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah: రైతులు, యువకులు, మహిళలు, సమాజంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కీలకమైన బిల్లులు చర్చ కోసం సిద్ధంగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

  • Share this:
    విపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. పార్లమెంట్‌లో చర్చ జరగకుండా విపక్షాలు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ రకంగా సభకు అంతరాయం కలిగించేవారు,అడ్డంకులు సృష్టించే వాళ్లు, వారి కుట్రల ద్వారా దేశం యొక్క అభివృద్ధి పథాన్ని ఆపలేరని అమిత్ షా అన్నారు. వర్షాకాల సమావేశాలు దేశ పురోగతికి సంబంధించి కొత్త ఫలాలను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమావేశాలపై దేశ ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని అమిత్ షా అన్నారు. రైతులు, యువకులు, మహిళలు, సమాజంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కీలకమైన బిల్లులు చర్చ కోసం సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

    అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారని అమిత్ షా గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ విస్తరణ జరిగిందని అన్నారు. దీనిని కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన విపక్షాలపై మండిపడ్డారు. వారు కూడా జాతీయ పురోగతిని దెబ్బతీయాలని కోరుకుంటారని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంలో వారికి ఎంతో అనుభవం ఉందని.. ఇదే అనుభవాన్ని పార్లమెంట్‌లోనూ ఉపయోగిస్తున్నారని అమిత్ షా అన్నారు.

    దేశ ప్రగతిని అడ్డుకోవడానికే వాళ్లు ఇలాంటివి చేయాలని ముందుగానే సిద్ధమయ్యారని విమర్శించారు. పార్లమెంటరీ నిబంధనలకు వారిచ్చే గౌరవం ఇదేనా ? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత స్పష్టంగా ఉందని దేశ ప్రజలను తాను మరోసారి స్పష్టం చేయదలుచుకున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇందులో భాగంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: