జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. విపరీతంగా మంచు కురిసే ఈ సీజన్‌లో అక్కడ ఉగ్రవాదులు మళ్లీ యాక్టివేట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir), లద్దాఖ్ (Ladakh)కు సంబంధించి కేంద్రహోంమంత్రి అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. లేహ్-లద్దాఖ్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు, జమ్మూ కాశ్మీర్ సమస్యపై సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు హోంశాఖ కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి రా, ఐబీ చీఫ్‌లు కూడా హాజరు కానున్నారు.
Union Home Minister Amit Shah will be holding two meetings on Leh-Ladakh at 3 pm and J&K at 4pm respectively: Sources pic.twitter.com/cGw5UrbjZ8
— ANI (@ANI) December 28, 2022
కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ రెండు కీలక సమావేశాలకు CRPF, BSF అధికారులు, జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు, IB చీఫ్, RAW చీఫ్‌తో పాటు హోం మంత్రిత్వ శాఖ అధికారులు హాజరవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా న్యూస్18కి తెలిసింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. ఆయన నిన్ననే ఢిల్లీకి వచ్చారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్, పారామిలటరీ బలగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమైక్య రాష్ట్రంలో శాంతి భద్రతలు, కాశ్మీరీ పండిట్లపై జరుగుతున్న దాడులు, ఉగ్రవాదులపై జరుగుతున్న ఆపరేషన్, డ్రోన్ కార్యకలపాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. దట్టమైన పొగమంచులో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సిధ్రా బైపాస్ ప్రాంతంలోని తావి వంతెన సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ అనంతరం.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Jammu and Kashmir, Ladakh