మోదీ 2.0 సర్కారు కాలపరిమితి మరో రెండున్నర ఏళ్లే మిగిలున్న దరిమిలా పరిపాలనకు సంబంధించి సంచలన నిర్ణయాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కీలక శాఖలు, విభాగాల అధిపతులపై వరుసగా రెండు రోజుల్లో ఒక ఆర్డినెన్స్, మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యాయి. పాలనా యంత్రాంగాన్ని పరుగులు తీయించడంతోపాటు సాంకేతికతనూ సమర్తంగా వినియోగించుకునేలా కేంద్ర మంత్రి వర్గంలోని 77 మంది మంత్రులను 8 బృందాలుగా విభజిస్తూ ప్రధాని మోదీ (PM Modi) నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అదే క్రమంలో పరిపాలనా బాధ్యతలను ప్రత్యక్షంగా నిర్వహించే శాఖల అధిపతులపైనా కేంద్రం వెంట వెంటనే సంచలన నిర్ణయాలు వెలువరించింది..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అత్యంత శక్తిమంతమైన దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీ కాలాన్నిరెండేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుతూ మోదీ సర్కార్ నిన్న ఆదివారం ఓ ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నడుమ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ బాసుల పదవీకాలాన్ని పెంచాక 24 గంటలు తిరక్కముందే కేంద్రం మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రక్షణ శాఖ, హోం శాఖ, ఇటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) విభాగాలకు సంబంధించి మంగళవారం కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. డిఫెన్స్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) సెక్రటరీల పదవీ కాలాలను మరో రెండేళ్లకు పెంచుతూ కేంద్రం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రంలో శక్తిమంతమైన విభాగాల అధిపతులకు సంబంధించి వరుసగా రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు వెలువడటం గమనార్హం.
ప్రస్తుతం మన దేశానికి డిఫెన్స్ సెక్రటరీగా అజయ్ కుమార్(ఐఏఎస్) వ్యవహరిస్తున్నారు. 2019లో నియమితులైన ఆయన నిబంధనల ప్రకారం రెండేళ్ల తర్వాత రాజీనామా చేయాలి. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియగా, తాజా పొడగింపుతో మరో రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. హోం సెక్రటరీగా ఉన్న అజయ్ కుమార్ భల్లా(ఐఏఎస్) కూడా 2019లో నియమితులైనవారు కావడం, తాజా గెజిట్ నోట్ తో మరో రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్ అర్వింద్ కుమార్(ఐపీఎస్) కూడా 2019లో నియమితులు కాగా, పొడగింపుతో మరో రెండేళ్లు కొనసాగుతారు. ఇక రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) సెక్రటరీగా ఉన్న సమంత్ గోయల్(ఐపీఎస్) కూడా 2019లో నియమితులైనవారు కావడం, పొడగింపుతో మరో రెండేళ్లు పదవిలో కోనసాగనుండటం ఖాయమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Defence Ministry, Pm modi, Union government, Union Home Ministry