Union Budget 2023 Updates : అమృత కాలంలో బడ్జెట్ ఇదీ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ బడ్జెట్ రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఆ ఏడు అంశాలను సప్త రుషులుగా ఆమె తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో రకరకాల అంశాలు ఉన్నా... ప్రధానంగా పన్ను మినహాయింపులు పెంచడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఐతే... ఈ బడ్జెట్ బాగుంది అంటూనే విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా గతేడాది బడ్జెట్‌తో పోల్చిచే... ఈసారి బడ్జెట్ కొంత మెరుగ్గానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి బడ్జెట్ తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈసారి బడ్జెట్‌లో కొన్ని హైలెట్స్ చూస్తే...
కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను మినహాయింపును రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేలకు ఇంత ఎక్కువ ఎప్పుడూ కేటాయించలేదు. అలాగే వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచారు. మొబిలిటీ ఇన్‌ఫ్రా కింద 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు నిర్మిస్తామని తెలిపారు. టూరిజం కోసం ఛాలెంజ్ మోడ్ ద్వారా 50 గమ్యస్థానాలను ఎంచుకొని అభివృద్ధి చేస్తామన్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుందనీ.. దానిపై 7.5 శాతం వడ్డీతో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్ పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు కేటాయింపులు 66 శాతం పెరిగి రూ.79,000 కోట్లకు చేరాయి. కీలక ప్రదేశాల్లో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు నిర్మిస్తామన్నారు. 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా సమస్యను తొలగిస్తామన్నారు. గిరిజనులకు సురక్షిత గృహాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు కోసం వచ్చే మూడేళ్లలో రూ.15,000 కోట్లు కేటాయిస్తామన్నారు.
అన్ని నగరాలు, పట్టణాల్లో.. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను 100 శాతం మార్చడానికి ప్రయత్నిస్తామన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. 63,000 క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2,516 కోట్లు కేటాయించారు. 5G సేవలను ఉపయోగించి యాప్‌లను అభివృద్ధి చేయడానికి 100 ల్యాబ్‌లు ఇంజనీరింగ్ సంస్థలలో ఏర్పాటు చేస్తామన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.35,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ డెవలప్ చేస్తామన్నారు. 30 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సహజ వ్యవసాయం ద్వారా కోటి మంది రైతులకు సాయం అందుతుందని తెలిపారు.