ప్రజలపై పన్నులు భారం వేయాలన్న ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. బడ్జెట్ సంకల్పాన్ని అందరూ అర్ధం చేసుకున్నారని భావిస్తున్నానని..దీనిని ప్రజలు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. నెట్వర్క్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ఇంటర్వ్యూ సందర్భంగా బడ్జెట్‌కు సంబంధించి పలు కీలక అంశాలను పంచుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొట్ట మొదటగా ఒక ప్రైవేట్ న్యూస్ నెట్‌వర్క్‌తో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అప్పులు తీసుకుంటున్నామని, నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నామని నిర్మల సీతారామన్ తెలిపారు.
''పన్నులను పెంచాలని ప్రభుత్వం ముందు నుంచీ అనుకోలేదు. ప్రైవేటీకరణ ద్వారా రూ. 2 లక్షల కోట్ల నిధులను సమీకరించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ప్రభుత్వం వద్ద ఎక్కువ ఆదాయ వనరులుంటే ప్రజలకు ఇంకా ఇచ్చే వాళ్లం. పేదలకు ఏం అవసరమో ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలుసు. అందుకే లాక్డౌన్ ప్రకటించిన 48 గంటల్లోనే గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ ఉద్దేశమేంటో అందరికీ అర్ధమయిందని అనుకుంటున్నా. ప్రజలను దీన్ని అంగీకరించాలి. '' అని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
If I had more resources to give I would have given it to the people. During the Pandemic, the small amounts we gave to some people were kept aside because there was uncertainty: Finance Minister Nirmala Sitharaman (@nsitharaman) tells @18RahulJoshi#FMtoNetwork18 pic.twitter.com/Mh77cWX3uj
— News18 (@CNNnews18) February 1, 2021
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2021- 22 ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఆరోగ్య రంగం కోసం కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. ఆత్మనిర్భర ఆరోగ్య పథకానికి రూ. 2,23,486 కోట్లు, రక్షిత మంచినీటి పథకానికి రూ.87,000 కోట్లు, స్వచ్ఛభారత్ అర్బన్ పథకానికి రూ. 141679 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించింది. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైప్ లైన్లలో పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయిం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. 1938 బీమా చట్టానికి సవరణ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇన్సూరెన్స్ కంపెనీల్లో FDI పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు. ఈ ఏడాదిలోనే LIC IPO ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అతి సాధారణమైన బడ్జెట్టేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే పెద్ద పీట వేశారని మండిపడుతున్నాయి. ఈ బడ్జెట్ ద్వారా ఓట్లకు మార్గం వేసుకున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజల అకౌంట్లలోకి డబ్బులు జమచేసి, వారికి చేయూతనిస్తారని ఆశించామని.. కానీ అలాంటిదేమీ జరగలేదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.