మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో... ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు పెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలు ఉంటాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మిగతా వర్గాల సంగతి ఎలా ఉన్నా... ఎన్నికలకు ముందు తమకు ప్రధాని నరేంద్రమోదీ ఏం ఇవ్వబోతున్నారనే దానిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మధ్యకాలంలో బీజేపీకి ఓటములు ఎదురుకావడంతో... రైతన్నలను ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారనే భావన రైతులతో పాటు విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుండటంతో... కేంద్రం కూడా రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఓ లాలీపాప్గా ప్రధాని మోదీ అభివర్ణించడంతో... కేంద్రం ఇందుకు సుముఖంగా లేదనే విషయం అర్థమైంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం తరహాలో రైతులకు పంట పెట్టుబడి ఇచ్చే పథకాన్ని కేంద్రం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయి.
రైతుబంధు తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా రైతులను తమ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వడ్డీ మాఫీ చేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అంశాలను కూడా కేంద్రం ఓటాన్ అకౌంట్లో ప్రస్తావించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్తో ప్రధాని నరేంద్రమోదీ ఏ మేరకు అన్నదాతలను ఆకట్టుకుంటారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Pm modi, Union Budget 2019