Union Budget 2019 - 2020 : ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడే నేతలు బీజేపీలో చాలా మంది ఉన్నారు. వాళ్లలో ఒకరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇదివరకు రక్షణ మంత్రిగా చేసి, మోదీ, అమిత్ షా దగ్గర మంచి మార్కులు కొట్టిన ఆమె... ఆర్థిక మంత్రిగా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల నుంచీ ఆమె చేస్తున్న కసరత్తుపై ఇప్పటికే ఢిల్లీ వర్గాల నుంచీ పాజిటివ్ సంకేతాలొచ్చాయి. అంతవరకూ ఓకే. మరి 5న లోక్ సభలో ప్రవేశపెట్టే బడ్జెట్ సామాన్యులకు ఎంతవరకూ కలిసొస్తుందన్నది తేలాలి. చాలా ప్రతిపాదనలూ, ఆశలూ ఉన్నాయి ప్రజల్లో. ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల వరకూ (ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆల్రెడీ పెంచారు) ఉంచుతారనే అంచనాలున్నాయి. అదే సమయంలో... ఏడాదికి రూ.10 కోట్లకు పైగా ఆదాయం వచ్చే వారిపై 40 శాతం పన్ను వెయ్యాలనే డిమాండ్లున్నాయి.
గృహ రుణాలపై వడ్డీకి ప్రస్తుతం ఉన్న పన్ను తగ్గింపును రూ.2 లక్షల నుంచీ మరింత పెంచాలని 65 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా కొత్తగా 5 లక్షల సొంత ఇళ్ల నిర్మాణం సాకారం అవుతుంది. రియాల్టీ సెక్టార్ కూడా దూసుకెళ్లేందుకు వీలవుతుంది.
మన ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కేంద్రం పట్టుదలగా ఉంది. అది జరగాలంటే... GDP వృద్ధి రేటు పెరగాల్సి ఉంది. అందుకు నిర్మలా సీతారామన్... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు ఆర్థిక నిపుణులు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తారనే ప్రచారం జరిగినా... అలాంటిదేమీ ఉండదని కేంద్రం సంకేతాలిచ్చింది.
నిజానికి మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే, ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరే బాగుంది. ఇందుకు ప్రధాన కారణం... ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాలు పెరిగిపోవడమే. వాటిలో చాలావరకూ ప్రభుత్వం ఇస్తున్న పథకాల వల్ల ఏర్పడుతున్న రుణాలే. ఆ రుణాలు తీరకపోవడంతో... తాము అప్పుల్లో కూరుకుపోతున్నామనీ, నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్‌మెంట్లు చెబుతున్నాయి.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ధరలు పెరగడం వల్ల ప్రజలు కూడా పెద్దగా పొదుపు చెయ్యట్లేదు. ఈ పరిస్థితి మారాలంటే పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావాల్సి ఉంటుంది. మరి కేంద్ర బడ్జెట్ ఈ ఆశలపై నీళ్లు చల్లుతుందా... ఆశలకు అనుగుణంగా ఉంటుందా అన్నది నాల్రోజుల్లో తేలుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Nirmala sitharaman, Union Budget 2019, Union budget 2019-2020