New Parliament: పార్లమెంట్ నుంచి ప్రధాని నివాసానికి సొరంగ మార్గం.. పూర్తి వివరాలు

కొత్త పార్లమెంట్ భవనం నమూనా

టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త భవనం నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.

 • Share this:
  ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి. కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని నివాసంతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం, ఎంపీ చాంబర్స్‌కు సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు.. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు రోడ్డు మార్గంలో పార్లమెంట్‌లో వెళ్లాల్సిన అవసరం లేకుండా సొరంగం మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుపై ప్రధాని కాన్వాయ్ వెళ్తే భారీగా సెక్యూరిటీ కల్పించాలి.. ట్రాఫిక్‌ను నిలిపివేయాలి.. ఈ సమస్యలకు సొరంగ మార్గం రూపంలో చెక్ పెట్టనున్నారు.

  ఐతే రాష్ట్రపతి ఇంటికి మాత్రం సొరంగ మార్గాన్ని నిర్మించడం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి పార్లమెంట్‌కు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు. కానీ ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఎంపీలు సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్‌కు రావాలి. ఈ క్రమంలోనే ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ఎంపీ చాంబర్స్‌కు సొరంగం మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇది సింగిల్ లేన్ రోడ్డు. పెద్ద కార్ల అవసరం లేకుండా గోల్ఫ్ కార్ట్‌లోనే సొరంగ మార్గం గుండా నేతలు పార్లమెంట్‌కు వెళతారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సౌత్ బ్లాక్‌ వైపు ప్రధాని నివాసం, ప్రధాన మంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసాన్ని నిర్మిస్తున్నారు.

  కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబరు 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణం కానుంది. ఇందుకోసం రూ.971 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ భవనంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభల కంటే ఇందులోని సభలు చాలా పెద్దవిగా డిజైన్ చేశారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు సరిపడా చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు.

  టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కొత్త భవనం నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: