పెట్రోల్ డీజిల్ నుంచి నిమ్మకాయ రసం దాకా.. విద్యుత్ చార్జీల నుంచి ఆర్టీసీ బస్సు టికెట్ల దాకా ఎటు చూసినా ధరల మోత భారీగా ఎదుర్కొంటున్న సామాన్యుడికి కనీసం చల్లటి ప్రయానాన్ని దూరం చేస్తూ.. క్యాబ్ లో ఏసీ రైడ్ కావాలంటే అదనంగా కాసులు చెల్లించాలంటూ కొందరు డ్రైవర్లు డిమాండ్ చేస్తుండటం దేశంలో పరిపాటిగా మారింది. బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ఇలా కారులోనే ప్రకటనలు అంటించి మరీ ఏసీ వేసినందుకు ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు గుంజుతున్నారు. అయితే ఇది కంపెనీ విధానం కాదని, ఏసీ కోసం అదనపు ఛార్జీ వసూలు చేసే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని ఉబెర్ సంస్థ చెబుతోంది. అయితే, జరుగుతోన్న పరిణామాలను బట్టి క్యాబ్ రేట్ల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. వివరాలివే..
ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్ (Uber) ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తూ రైడర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఉబెర్ ఎన్ని మంచి ఫీచర్లు తీసుకొచ్చినా కస్టమర్లలో పూర్తిస్థాయిలో హ్యాపీనెస్ నింపలేకపోతోంది. ఇందుకు కారణం కొందరు ఉబెర్ డ్రైవర్లు (Uber Drivers) ఏదో ఒక కారణం చూపి కస్టమర్ల దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేయడమే. ఈ వేసవి కాలంలో ఈ డ్రైవర్లు మరొక సాకు చూపి కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులను ఛార్జ్ చేస్తున్నారు. ఈ డ్రైవర్లు రైడ్‌ల సమయంలో ఎయిర్ కండీషనర్ (AC) స్విచ్ ఆన్ చేయడానికి కస్టమర్లకు అడిషనల్ అమౌంట్ వసూలు వస్తున్నారు. ఇది తెలిసిన రైడ్-హెయిలింగ్ కంపెనీ ఉబెర్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేసే డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఏప్రిల్‌లోనే ఇంద్రప్రస్థ గ్యాస్ (Indraprastha Gas) మూడుసార్లు సీఎన్జీ (CNG) ధర పెంచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో CNG ధర కిలోకు 69.11కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఉబెర్, ఓలా క్యాబ్‌ల డ్రైవర్లు ఏసీ ఆన్ చేయడానికి సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ, అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారని చాలా మంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో ఇప్పుడు కిలో CNG ధర రూ.71.67గా ఉంది. అయితే ఈ విషయంపై ఉబెర్ స్పందించింది.
“మేం డ్రైవర్ల అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ వింటాం. ఇంధనం, సీఎన్జీ ధరలలో ప్రస్తుత పెరుగుదల డ్రైవర్లలో ఆందోళన కలిగిస్తోందని అర్థం చేసుకున్నాం. ఈ పెంపు ప్రభావాన్ని డ్రైవర్లపై తగ్గించేందుకు మేం కొన్ని నగరాల్లో ఛార్జీలను పెంచాం. రాబోయే వారాల్లో మేం పరిస్థితిని అంచనా వేస్తాం. అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటాం, ” అని ఉబెర్ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, ఏసీ విషయంలో ఎక్స్ట్రా ఛార్జ్ చేసే డ్రైవర్ల పై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. “రైడ్ సమయంలో ఏసీని ఆన్ చేయడానికి ఉబెర్ ఎలాంటి అడిషనల్ ఛార్జీలను విధించదు. అటువంటి ఫీజు వసూలు చేసే ఏ డ్రైవర్ అయినా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించినందుకు కంపెనీ నుంచి చర్యను ఎదుర్కోవలసి ఉంటుంది." అని డ్రైవర్లను ఆయన హెచ్చరించారు.
ఉబెర్ తన ప్లాట్‌ఫామ్‌లోని డ్రైవర్లకు రైడ్ సమయంలో కారు ఏసీని స్విచ్ ఆన్ చేసి ఉంచాలని సూచిస్తోంది. ఒకవేళ డ్రైవర్లు ఏసీని స్విచ్ ఆన్ చేసేందుకు ఒప్పుకోకపోతే, రైడర్‌లు ఇన్-యాప్ చాట్ మెసేజెస్, పోస్ట్-ట్రిప్ ఫీడ్‌బ్యాక్ ద్వారా ఉబెర్ ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ గైడ్‌లైన్స్ డ్రైవర్లు పాటించకపోవడం వల్ల వారు ఉబెర్ యాప్‌కి యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది” అని ప్రతినిధి తెలిపారు. ఉబెర్ ఇటీవల ముంబైలో ప్రయాణ ఛార్జీలను 15% పెంచింది. పెరుగుతున్న CNG ధరల కారణంగా, ఢిల్లీలోని ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఏప్రిల్ 18 నుంచి సమ్మెకు దిగేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. డ్రైవర్ల సమ్మె దరిమిలా కంపెనీలు క్యాబ్ రేట్లను పెంచడానికి రంగం సిద్ధమవుతోన్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.