TWO SHOCKING TWISTS IN A MARRIAGE ODISHA GROOM MARRIES BRIDE MINOR SISTER AFTER SHE ELOPED WITH BOYFRIEND HSN
కొద్ది గంటల్లో పెళ్లనగా ప్రియుడితో వధువు ఎస్కేప్.. ఆమె చెల్లెలితో వరుడి పెళ్లి.. అంతలోనే మరో షాక్..!
ప్రతీకాత్మక చిత్రం
పెళ్లి వేడుకలోనే ఓ విచిత్ర సంఘటన జరిగింది. కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి కూతురు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో తప్పేదేమీ లేక ఆ పెళ్లికుమార్తె తండ్రి తన చిన్న కూతురిని వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ చిన్న కూతురితో పెళ్లి జరిగిన రెండ్రోజుల్లోనే వరుడికి ఊహించని షాక్ తగిలింది.
కొద్ది గంటల్లో పెళ్లనగా ’నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. కొద్ది సేపు ఆగు‘ అంటూ పెళ్లి పీటల పైన కూర్చునే వధువు చెప్పిన ఘటన గురించి చదివే ఉంటారు. కాసేపట్లో పెళ్లనగా పెళ్లి కొడుకు జంప్ అయిన ఘటన గురించి కూడా విని ఉంటారు. ప్రియురాలికి వేరొకరితో పెళ్లి కావడం ఇష్టం లేక, భరించలేక ఆమె విడిదింటి వద్ద తుపాకీతో కాల్పులు జరిపిన భగ్నప్రేమికుడి వ్యధను టీవీల్లో చూసి ఉంటారు. తాజాగా పెళ్లి వేడుకలోనే ఓ విచిత్ర సంఘటన జరిగింది. కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. ప్రియుడితో వెళ్లిపోయిందని ఆలస్యంగా తెలిసింది. దీంతో తప్పేదేమీ లేక ఆ పెళ్లికుమార్తె తండ్రి తన చిన్న కూతురిని వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ చిన్న కూతురితో పెళ్లి జరిగిన రెండ్రోజుల్లోనే ఆ నవ వరుడికి ఊహించని షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే..
ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా భవానిపాట్నా పరిధిలో ఉన్న మాల్పడ గ్రామంలో రెండ్రోజుల వ్యవధిలోని ఓ పెళ్లి వేడుకలో వరుసగా రెండు షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ గ్రామంలో ఓ యువతికి 26 ఏళ్ల వ్యక్తితో మంగళవారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే కొద్ది గంటల్లో పెళ్లనగా ఆమె కనిపించకుండా పోయింది. తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందన్న విషయం పెళ్లి మండపమంతా పాకిపోయింది. దీంతో వరుడి తరుపు వాళ్లు నానా రభస చేశారు. ఆ వధువు తండ్రి విధిలేక తన చిన్న కుమార్తెను ఒప్పించి ఆమెను ఆ వరుడికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. అయితే ఆ పెళ్లి జరిగిన రెండ్రోజుల్లోనే గురువారం మరో ఊహించని సంఘటన జరిగింది.
నవ వరుడి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆ నవ వధువును పోలీసులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. విషయం ఏమిటంటే ఆమె ఇంకా మైనర్ బాలికే. 15 ఏళ్ల వయసుకే పెళ్లేంటంటూ ఆ బాలిక అన్నయ్య తండ్రితో గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నవ వరుడి ఇంటికి వెళ్లి ఆమెను సంరక్షించారు. ఆమెను ఆమె అన్నయ్యకు అప్పజెప్పారు. ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
బాలికకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కాపురానికి పంపించొద్దని తండ్రికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అటు నవ వరుడికి కూడా అదే స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోందనీ, తండ్రి ఇంట్లోంచే ఆమె తన పరీక్షలు రాయాలనీ, 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ పెళ్లి గురించి, భర్త గురించి ఎలాంటి రాకపోకలు ఉండొద్దని పోలీసులు తేల్చిచెప్పారు. కాగా వరుడి తరపు వారి ఒత్తిడి మేరకే తన చిన్న కూతురిని ఇచ్చి వారికి పెళ్లి చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి వాపోవడం గమనార్హం.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.