Blue Flag: భారతదేశంలోని మరో రెండు బీచ్‌లకు దక్కిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. వివరాలివే..

బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన మరో రెండు బీచ్‌లు (ఫైల్ ఫొటో)

భారతదేశంలోని మరో రెండు బీచ్‌లకు తాజాగా 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ లభించింది. దాంతో దేశంలో మొత్తం ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌ల సంఖ్య 10కి చేరింది.

  • Share this:
భారతదేశంలోని మరో రెండు బీచ్‌లకు (Beach) తాజాగా 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ లభించింది. దాంతో దేశంలో మొత్తం ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌ల సంఖ్య 10కి చేరుకుంది. ఈ విషయాన్ని పర్యావరణ మంత్రిత్వ (Environmental) శాఖ వెల్లడించింది. ఈ ఏడాది తమిళనాడులోని 'కోవలం' (Kovalam Beach), పుదుచ్చేరిలోని 'ఈడెన్' (Eden Beach) బీచ్‌లకు ఇంటర్నేషనల్ ఎకో ఫ్రెండ్లీ లేబుల్ అయిన "బ్లూ ఫ్లాగ్‌ ట్యాగ్" లభించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రపంచ స్థాయి ప్రతిష్ఠాత్మక స్వచ్ఛంద అవార్డుల్లో ఒకటైన "బ్లూ ఫ్లాగ్" అవార్డులను ఉత్తమ బీచ్‌లకు అందజేస్తారు. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్ చేజిక్కించుకోవాలంటే బీచ్‌లు చాలా పరిశుభ్రంగా.. సర్వాంగ సుందరంగా ఉండాలి. అలాగే బీచ్ సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ ఉండటం తప్పనిసరి. బీచ్‌ల విశేషాలు చెప్పేందుకు సిబ్బంది ఉండాలి. అంతేకాదు బీచ్ టూరిస్టులకు భద్రత తప్పక అందించాలి. ఇంకా తదితర ప్రమాణాలకు తగ్గట్లుగా ఉంటేనే బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్‌’ అనే అరుదైన గౌరవం దక్కుతుంది.

డెన్మార్క్‌లోని పర్యావరణ అవగాహన సంస్థ అయిన ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌(ఎఫ్ఈఈ)’ ఉత్తమ బీచ్లను బ్లూ ఫ్లాగ్ తో సత్కరిస్తుంది. గతేడాది భారత ప్రభుత్వం ఎంపిక చేసిన శివరాజ్‌పూర్ (గుజరాత్), ఘోగ్లా (డయ్యూ), కాసర్‌కోడ్, పదుబిద్రి(కర్ణాటక), కప్పడ్ (కేరళ), రుషికొండ (ఆంధ్రప్రదేశ్), గోల్డెన్ (ఒడిశా), రాధానగర్ ( అండమాన్ & నికోబార్) అనే 8 బీచ్‌లకు అక్టోబర్ 6, 2020న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్‌ను అందజేసింది. తాజాగా మళ్లీ ఈ బీచ్‌లను రీ-సర్టిఫికేషన్ తో సత్కరించింది.

ఈ విషయాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌లో తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా పయనిస్తున్న ఇండియా మరో మైలురాయిని అందుకుందని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భారతదేశ తీర ప్రాంతాల సుస్థిర అభివృద్ధిని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ అతెస్స్టిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (BEAMS)ను ప్రారంభించింది. MoEF & CC వనరుల సమగ్ర నిర్వహణ ద్వారా తీర, సముద్ర పర్యావరణ వ్యవస్థలను సంరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో భారత కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పర్యావరణ లేబుల్ "బ్లూ ఫ్లాగ్" ను సాధించడమే దీని లక్ష్యం.

యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO), యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) సభ్యులతో కూడిన అంతర్జాతీయ జ్యూరీ ఉత్తమ బీచ్‌లను ఎంపిక చేసి సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బ్లూ ఫ్లాగ్ ఇచ్చేముందు ఎఫ్ఈఈ డెన్మార్క్ 33 ప్రమాణాలతో పర్యవేక్షణ, ఆడిట్‌లను నిర్వహిస్తుంది. ఈ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది అంటే.. ఆ బీచ్ అన్ని సౌకర్యాలతో ఉత్తమంగా ఉందని అర్థం. రాబోవు 5 ఏళ్లలో మంత్రిత్వ శాఖ విజన్ ఎజెండాలో ICZM చొరవ కింద మరో 100 బీచ్‌లను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Published by:John Naveen Kora
First published: