• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • TWITTER VS CENTRE TWITTER HAD LOST SAFE HARBOUR PROTECTION WHAT WILL BE HAPPENED NEXT HERE IS KEY DETAILS GH SK

Explained: ట్విట్టర్‌‌లో సేఫ్ హార్బర్ హోదా తొలగింపు.. నెక్ట్స్ ఏంటి? ఇంకా ఎలాంటి చర్యలుంటాయి?

ప్రతీకాత్మక చిత్రం

Twitter Vs Centre: ట్విటర్‌కు ఉన్న ‘సేఫ్ హార్బర్’ రక్షణను కేంద్రం తాజాగా తొలగించింది. కొత్త ఐటీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి నెక్ట్స్ ఏంటి?

  • Share this:
కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. భారత్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల కోసం రూపొందించిన కొత్త ఐటీ నిబంధనలను తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వీటిని లెక్కచేయట్లేదనే ఉద్దేశంతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌పై కేంద్రం కన్నెర్ర చేసింది. నిబంధనల ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్ హోదా ఉన్న ముగ్గురు అధికారులను నియమించాల్సి ఉండగా, దీనిపై ట్విట్టర్ స్పందించలేదు. దీంతో ఆ సంస్థకు ఉన్న ‘సేఫ్ హార్బర్’ రక్షణను కేంద్రం తాజాగా తొలగించింది. కొత్త ఐటీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79 కింద ట్విట్టర్‌కు ఉన్న రక్షణ, తాజాగా తొలగిపోయింది. ఇప్పుడు ట్విట్టర్‌పై ఏదైనా వివాదం తలెత్తినప్పుడు, ఆ సంస్థపై ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

* ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద మధ్యవర్తులకు కల్పించే రక్షణ అంటే ఏంటి?
ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు రక్షణ ఉండేది. అంటే.. యూజర్లు షేర్ చేసే డేటా లేదా కమ్యూనికేషన్ లింక్‌ల విషయంలో సంబంధిత ప్లాట్‌ఫాంను మధ్యవర్తిగా భావించేవారు. అందువల్ల ప్లాట్‌ఫాంలో వ్యాపింపజేసే తప్పుడు వార్తలు, నకిలీ సమాచారంతో ఆ ప్లాట్‌ఫాంకు సబంధం ఉండదు. ఈ విషయంలో న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సిన అవకాశం లేకుండా ‘సేఫ్‌ హార్బర్’ రక్షణ ఉండేది. అయితే తాజా ఐటీ నిబంధనల్లో.. కేంద్రం సూచనలను ట్విట్టర్ పక్కన పెట్టింది. ఫలితంగా ఈ హోదాను రద్దు చేసింది. ఇప్పుడు ట్విట్టర్‌లో చట్టవ్యతిరేకమైన కంటెంట్‌ షేర్ అయితే.. దీనికి ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో థర్డ్ పార్టీ కింద ట్విట్టర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

* కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ నిబంధనలను ట్విట్టర్ కావాలనే పాటించట్లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతున్నారు. బుధవారం ఈ విషయంపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్ ఈ మార్గాన్ని ఎంచుకుందని తెలిపారు. "భావ ప్రకటన గురించి నీతులు చెప్పే ట్విట్టర్, మధ్యవర్తిత్వ మార్గదర్శకాల విషయంలో ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ మార్గాన్ని ఎంచుకుంటోంది. భారత వినియోగదారుల కోసం రూపొందించిన మార్గదర్శకాలను పాటించేందుకు నిరాకరిస్తోంది. అంటే కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు ట్విట్టర్ ఒప్పుకుంది. దీనికి తోడు ఇష్టం వచ్చినప్పుడు కొందరి పోస్టులకు మ్యానిప్యులేటెడ్ మీడియా అనే ట్యాగ్‌ తగిలిస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వర్తించే మన కంపెనీలు అక్కడి చట్టాలను పాటిస్తాయి. కానీ మన దేశ చట్టాలను మాత్రం ట్విట్టర్ పాటించట్లేదని మంత్రి విమర్శించారు.

* ఈ నిర్ణయం ట్విట్టర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే చట్టపరమైన రక్షణను ట్విట్టర్‌ ప్రస్తుతం కోల్పోయింది. అంటే.. ట్విట్టర్‌లో వ్యాపించే తప్పుడు సమాచారానికి సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చట్టపరమైన విచారణను సైతం ట్విట్టర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. హింసను ప్రేరేపించే సమాచారం, భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రచారం చేసినప్పుడు.. కేవలం ట్వీట్ చేసిన వ్యక్తి మాత్రమే కాకుండా, ట్విట్టర్ కూడా దానికి బాధ్యత వహించాలి.

* దీర్ఘకాలంలో సంస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ప్రస్తుతం మీడియా, ప్రచురణ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 26 శాతంగా ఉంది. దీర్ఘకాలంలో ట్విట్టర్‌ సైతం ఈ పరిమితికి లోబడి ఉండాలనే నిబంధనలు విధించే అవకాశం ఉంది. అంటే, మిగిలిన 74 శాతం వాటాను ట్విట్టర్ భారతీయ కంపెనీలు లేదా కొనుగోలుదారులకు కట్టబెట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Published by:Shiva Kumar Addula
First published: