ప్రపంచంలోనే నాలుగో అత్యంత శక్తిమంత దేశమైన భారత్‌కు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాకింగ్ కు గురికావడం సంచలనం రేపుతున్నది. దేశాధినేతల ఖాతాల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల డేటాకు భద్రత ఏదనే అనుమానాలు పెరిగాయి. భారత ప్రభుత్వం త్వరలోనే పార్లమెంటులో బిల్లుగా పెట్టనున్న క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ల అంశంపైనే హ్యాక్‌కు గురైన మోదీ ఖాతా నుంచి ప్రకటనలు వెలువడటం కలకలంగా మారింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఫిర్యాదు చేయడంతో ట్విటర్ సంస్థ హుటాహుటిన స్పందించింది. అయితే, అసలేం జరిగిందనే వివరణ ఇవ్వాల్సిన ట్విటర్ అనూహ్య ప్రకటనతో సరిపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. భారతీయుడైన పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈవో అయిన కొద్ది రోజులకే ఇలా జరగడంపై కామెంట్లు వస్తున్నాయి..
అగ్రదేశాధినేతలు అందరిలోకీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీకి ట్విటర్ లో 7.3కోట్ల మంది ఫాలోవర్లున్నాయి. అలాంటాయన ఖాతా.. ఆదివారం తెల్లవారుజామున హ్యాకింగ్ కు గురైంది. భారత్ లో బిట్ కాయిన్ ను లీగలైజ్ చేశామని, ప్రభుత్వం 500 బిట్ కాయిన్లను కొని ప్రజలకు పంచబోతోందంటూ మోదీ ట్విటర్ అకౌంట్లో ఒక పోస్ట్ వచ్చింది. భారత్ లో అంత రాత్రివేళ, విదేశాల్లో మార్కెట్లు నడిచే సమయంలో పీఎం మోదీ నుంచి ఇలాంటి ప్రకటన వచ్చిందేమిటాని చాలా మంది ఖంగుతిన్నారు. అయితే, అదొక తప్పుడు ప్రకటన అంటూ పీఎంవో వివరణ ఇచ్చింది.
ప్రధాని మోదీ పర్సనల్ ట్విటర్ అకౌంట్ కొద్ది సమయంపాటు హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని ట్విటర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆ పోస్టును తొలగించి, అకౌంట్ ను పునరుద్ధరించారని, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇది జరిగిందని పీఎంవో ప్రకటన చేసింది. కాగా, ఇదే అంశంపై ట్విటర్ సంస్థ సైతం వివరణ ఇచ్చింది. ‘భారత ప్రధాని ట్విటర్ హ్యాక్ కు గురైన సమయంలో ప్రపంచంలో ఇతర అకౌంట్లేవీ ప్రభావితం కాలేదని మా పరిశోధనలో వెల్లడైంది. హ్యాకైన ప్రధాని ఖాతాను మళ్లీ పునరుద్ధరించాం. దాన్ని మరింత సురక్షితంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు పీఎంవోతో మేం 24x7 ఓపెన్ లైన్ లో అందుబాటులో ఉన్నాం..’అని ట్విటర్ సంస్థ పేర్కొంది.
ఆ సమయంలో మోదీ ఒక్కరి అకౌంటే హ్యాక్ అయిందన్న ట్విటర్ సంస్థ.. ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తులను మాత్రం గుర్తించలేకోపోయింది. గతంలోనూ ఓ సారి ప్రధాని మోదీ ట్విటర్ హ్యాకింగ్ కు గురికాగా, ఆ పని చేసిన జాన విక్ ను గుర్తించగలిగారు. కానీ ఈసారి మాత్రం హ్యాకర్లు ఎవరనేది అంతుపట్టడంలేదు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్లపై భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న క్రమంలోనే ఇలా జరగడం చర్చనీయాంశమైంది. బిట్ కాయిన్లను భారత్ గుర్తించనప్పటికీ, వాటి ద్వారా మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చేసేందుకు నియంత్రిత చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. అలాంటిదిప్పుడు హ్యాకర్లు అనుచితానికి పాల్పడ్డారు. వాళ్ల భరతం పట్టేలా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకోవచ్చనే చర్చ నడుస్తోంది. ఇది బిట్ కాయిన్ మాఫియా పనేనా? అనే అనుమానాలున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.