Twitter: ట్విటర్ గ్రీవెన్స్ ఆఫీసర్ రాజీనామా.. నియమించిన కొన్ని రోజులకే గుడ్‌బై.. నెక్ట్స్ ఏంటి?

ట్విట్టర్ లోగో

Twitter: కేంద్రం చివరి నోటీసులకు స్పందించిన ట్విటర్.. చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, వెల్లడించింది. ధర్మేంద్ర చతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. కానీ కొద్ది రోజులే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

 • Share this:
  భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ట్విటర్‌ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి తన పదవికి రాజీనమా చేశారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా.. ఇటీవలే ట్విటర్ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా నియమితులైన ధర్మేంద్ర చతుర్‌, ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇటీవలే ఆయన బాధ్యతలు చేపట్టారు. కానీ అంతలోనే గుడ్‌బై చెప్పారు. ఆయన ఉన్నపళంగా ఎందుకు తప్పుకున్నారన్న వివరాలు మాత్రం తెలియ లేదు. గ్రీవెన్స్‌ అధికారి స్థానంలో చతుర్ పేరును తొలగించింది ట్విటర్. ప్రస్తుతం ఇండియా గ్రీవెన్స్ అధికారి స్థానంలో.. ట్విటర్ కంపెనీ పేరు, అమెరికా అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఐడీతో కూడి మరొకరి పేరు కనిపిస్తోంది. ఇప్పుడు దీని గురించి దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

  కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో The Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021ని నోటిఫై చేసింది. వార్తా వెబ్‌సైట్లు, ఓటీటీలు, సోషల్ మీడియాకు సంబంధించిన ఆ కొత్త రూల్స్ మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు భారత్‌లో అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి. యూజర్లు, బాధితులు చేసే ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజంను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

  కొత్త నిబంధనలన ప్రకారం.. 50 లక్షల యూజర్లను కలిగిన సోషల్‌మీడియా కంపెనీలు ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాలి.  సదరు అధికారి పేరు, ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచాలి. పెద్ద సోషల్ మీడియా సంస్థలు భారత్‌ చీఫ్ కంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్,  గ్రీవెన్ ఆఫీసర్‌ను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారతీయులే అయి ఉండాలి. ఐతే నిబంధన అమలులో ట్విటర్ ఆలస్యం చేసింది. ఈ క్రమంలోనే ఆ సంస్థకు కేంద్రం వరుసగా నోటీసులు పంపింది. కేంద్రం చివరి నోటీసులకు స్పందించిన ట్విటర్..  చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, వెల్లడించింది.  ధర్మేంద్ర చతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. కానీ కొద్ది రోజులే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

  ఇటీవల ట్విటర్ వరుస వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని రోజులు క్రితం ఏకంగా కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ప్రసాద్‌కే షాక్ ఇచ్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసింది. దాదాపు గంటపాటు ఆయన ఖాతాను స్తంభింపజేసింది. అనంతరం ఆయన ఖాతాను పునరుద్ధరించింది. ట్విట్టర్ తీరుపై రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోందని.. ట్విట్టర్ సొంత అజెండా అమలు చేస్తోందని మండిపడ్డారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతితో పాటు మరికొందరి ప్రముఖుల ట్విటర్ ఖాతాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను తొలగించింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మళ్లీ బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది.

  మరోవైపు నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందున .. మనదేశంలో ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయింది. ఇక నుంచి ట్విటర్ యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: