Twitter: కేంద్రమంత్రికి ట్విట్టర్ ఊహించని షాక్.. గంట తరువాత మళ్లీ..

ప్రతీకాత్మక చిత్రం

Twitter: తమకు అనుకూలంగా వ్యవహరించని వారి ఖాతాలు స్తంభింపజేస్తోందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.

  • Share this:
    ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ కేంద్ర ఐటీ మంత్రికే ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గంటపాటు ఆయన ఖాతాను స్తంభింపజేసింది. అనంతరం ఆయన ఖాతాను పునరుద్ధరించింది. ట్విట్టర్ తీరుపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ కొత్త ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. తన అకౌంట్‌ యాక్సెస్ నిలిపేయడానికి ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని ఆయన తెలిపారు.

    కొత్త ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విట్టర్ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్విట్టర్ సొంత అజెండా అమలు చేస్తోందని మండిపడ్డారు. ట్విట్టర్ తీరు చూస్తుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పనిచేస్తున్నట్టుగా లేదని వ్యాఖ్యానించారు. తమకు అనుకూలంగా వ్యవహరించని వారి ఖాతాలు స్తంభింపజేస్తోందని కేంద్రమంత్రి ఆరోపించారు. అయితే కొత్త ఐటీ చట్టాలకు కట్టుబడి నడుచుకోకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.



    కొంతకాలంగా కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య కొత్త ఐటీ చట్టాల అమలు విషయంలో వివాదం నడుస్తోంది. ఈ చట్టాలకు లోబడి నడుచుకునేందుకు ట్విట్టర్ మొదట నిరాకరించింది. దీంతో ట్విట్టర్‌‌పై కేంద్రం సీరియస్ అయ్యింది. చట్టాలకు లోబడి నడుచుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అనంతరం ఈ విషయంలో ట్విట్టర్ దిగొచ్చింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుందనే చర్చ మళ్లీ మొదలైంది.
    Published by:Kishore Akkaladevi
    First published: