నాన్నకు ప్రేమతో సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఎక్కడో జరిగే సంఘటనకు మరెక్కడో రియాక్షన్ ఉంటుందంటూ ఆ సినిమాలో హీరో చెబుతూ ఉంటాడు. అచ్చం అలాగే, అమెరికాలో ఓ సంచలన ఘటన జరిగితే, దాని రియాక్షన్ భారత్ లో కనిపించింది. మన దేశ ప్రధాని మోదీకి మరో ఖ్యాతిని తెచ్చి పెట్టింది. అదేంటబ్బా అనుకుంటున్నారా..? అమెరికాలో క్యాపిటల్ భవన్ లో దాడి జరిగిన తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఆయన్ను అభిశంసన చేయాలని, పదవి నుంచి ముందే తొలగించాలని ఆలోచనలు కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్ బుక్ తోపాటు, ట్విటర్ కూడా ఆయన అకౌంట్లను శాశ్వతంగా క్లోజ్ చేశాయి. అంటే ఆయన అకౌంట్లపై నిషేధం విధించాయన్నమాట. ట్రంప్ ట్విటర్ ఖాతా నిషేధం కావడంతో, ప్రధాని మోదీకి ఓ అరుదైన ఘనత దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న రాజకీయ నేతల్లో అత్యధిక ట్విటర్ ఫాలోవర్లు ఉన్న నేతగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధమ స్థానంలో నిలిచారు. ట్విటర్ లో ట్రంప్ కు 88.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. మోదీకి 64.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్ ఖాతా క్లోజ్ అవడంతో, యాక్టివ్ పొలిటిషియన్లలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఇలా ఓ అరుదైన ఘనత, ఆయన ప్రమేయం లేకుండానే ఆయనకు దక్కిందన్నమాట.
ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన జో బైడెన్ కు 23.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. హోంమంత్రి అమిత్ షాకు 24.2 మిలియన్ల మంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు 21.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన ఘనత మాత్రం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకే దక్కుతుంది. కాకపోతే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు కాబట్టి, యాక్టివ్ పొలిటిషియన్లలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన నేతగా మోదీకి అరుదైన ఘనత దక్కిందన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Barack Obama, Donald trump, Narendra modi, Twitter, US Elections 2020