కరోనా విలయం తాండవంతో అమెరికా విలవిల్లాడుతోంది. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ల కోసం ఇతర దేశాల నుంచి వచ్చే వర్కర్లపై ఆంక్షలు విధిస్తున్నారు ట్రంప్. హెచ్–1బీ, ఎల్–1, ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తేనే స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆయన అన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులపై సంతకం చేస్తానని చెప్పారు.
అయితే ఈ ఆంక్షల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు ఎంతో కొంత మినహాయింపులు ఉంటాయని.. కానీ మొత్తంగా వలసదారి విధానాన్ని బాగా కఠినతరం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. కోవిడ్19 తర్వాత అమెరికాలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని.. ప్రస్తుతం పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటేనే స్థానికులకు ఉద్యోగాలు కల్పించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది వీసాలు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా నిర్ణయం వల్ల ఎక్కువ ప్రభావం భారతీయులపైనే పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏటా జారీచేసే 85 వేల హెచ్–1బీ వీసాల్లో 70శాతం భారత టెకీలే దక్కించుకుంటున్నారు. ఐతే ఇప్పటికే హెచ్1 వీసాలతో పనిచేసున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి మాత్రమే కొన్ని నెలలు ఇబ్బందులు ఉంటాయని.. ఈ ఏడాది వారికి వీసా రాకపోవచ్చని వెల్లడించారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి..ఆర్థిక వ్యవస్థ గాడినపడితే, వచ్చే సంవత్సరం నాటికి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, USA