త్రిపుర (Tripura) ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ (Biplab Deb Resigns) శనివారం బీజేపీకి భారీ షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను గవర్నర్ ఎస్ ఎన్ ఆర్యకు సమర్పించారు. కాగా, అంతర్గత కుమ్ములాట్ల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే బిప్లబ్ తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, బిప్లబ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అధిష్టానం ఆయనకు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే బిప్లబ్ కుమార్.. న్యూఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గురువారం సమావేశమై ఈశాన్య రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
బీజేపీ (Bjp) అంతర్గత పోరును అరికట్టడంలో బిప్లబ్ విఫలమైనట్లు తెలుస్తోంది. అదే విధంగా, టీఎంసీ విస్తరణను కూడా అడ్డుకోవడంలో విఫలం అయినట్లు బీజేపీకి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. కాగా, ప్రభుత్వంపై వ్యతిరేకతను తప్పించుకునేందుకు ముందు జాగ్రత్తగా బిప్లబ్ (Biplab Deb Resigns) ఈ విధంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. కాగా, ఇప్పటికే కొత్త బీజేపీ సారథిని ఎన్నుకునేందుకు బీజేపీ పరిశీలకులుగా భూపేందర్ యాదవ్, వినోద్ తాన్డే లను నియమించింది. వీరి ఆధ్వర్యంలోనే తొందరలోనే సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో.. పార్టీ రాష్ట్ర ఇంచార్జి వినోద్ సోంకర్ కూడా పాల్గొననున్నారు.
త్రిపురలో .. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుదీప్ రాయ్ బర్మన్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. సిఎం దేబ్‌కు వ్యతిరేకంగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని సుదీప్ రాయ్ బర్మన్ పేర్కొన్నారు. సీఎం బిప్లబ్ దేబ్ వైఖరి నియంతలా ఉందని, ప్రభుత్వాన్ని నడిపేంత అనుభవం ఆయనకు లేదని, అందుకే ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని బర్మన్ బీజేపీని డిమాండ్ చేస్తున్నారు. త్రిపురలోని 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజేపికి 36 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తంగా ఉన్నారని ఆయన వాదిస్తున్నారు. అయితే, సుదీప్ రాయ్ వాదన నిజమైతే.. ఎమ్మెల్యేల ఆందోళనలను పరిష్కరించకుండా త్రిపురలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం బిజేపికి కష్టమేనని తెలుస్తుంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.