(K.Lenin,News18,Adilabad)
అంతరించిపోతున్న గిరిజన కళలు(Tribal Arts), సంస్కృతులను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం(Government) నిర్వహించిన జాతీయ స్థాయి గిరిజన నృత్యోత్సవంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు(Adilabad Distritct) చెందిన గిరిజనులు మెరిశారు. చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ (Raipur) లో నిర్వహించిన ఈ గిరిజన నృత్యోత్సవంలో దేశ, విదేశలకు చెందిన గిరిజనులు కళాకారులు పాల్గొని తమ తమ సంప్రదాయ కళలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అయితే ఈ నృత్య ఉత్సవంలో పాల్గొని తమ కళను ప్రదర్శించే అరుదైన అవకాశం ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన కళాకారులకు దక్కింది.
ఇటీవల కేంద్రం ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడి నృత్య కళాకారుడు, శిక్షకుడు కనక రాజు శిష్యులు ఈ మహోత్సవంలో పాల్గొని తమ సంప్రదాయ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యోత్సవంలో భాగంగా రెండు విభాగాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చత్తీస్గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, కర్నాటక, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగల నృత్య రూపాలతోపాటు, ఉజ్బెకిస్తాన్, నైజీరియా, శ్రీలంక, ఉగాండా, సిరియా, మాలి, పాలస్తీనా తదితర దేశాల నుండి వచ్చిన విభిన్న గిరిజన సమూహాలకు చెందిన కళాకారులకు ఈ ఉత్సవం ఆతిథ్యం ఇచ్చింది.
ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతేవాడ, కోర్బా, బిలాస్పూర్, గరియాబంధ్, మణిపూర్, ధురా, ధామ్తరి, సర్గుజా, జాష్పూర్లోని గిరిజన ప్రాంతాల కళాకారులు తమ సంస్కృతి మరియు సంప్రదాయాలను తమ నృత్య రూపాల ద్వారా ప్రదర్శించారు. ఈ మహోత్సవంలో నృత్య ప్రదర్శనలతో పాటు గిరిజన వర్గాల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చలు కూడా జరిపినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వెళ్ళిన గుస్సాడి బృందానికి నేతృత్వం వహిస్తున్న కనక వెంకటేశ్వర్ రావ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి ఉత్సవంలో పాల్గొనే అవకాశం రావడం గుస్సాడికి లభించిన గుర్తింపు అని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రదర్శనలు కళాకారుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. గిరిజనులు అత్యంత పవిత్రంగ భావించే గుస్సాడి వేషధారణతో దీపావళి సమయంలో జరుపుకునే దండారి ఉత్సవాలు కూడా ఇదే సమయంలో కొనసాగడం, మరోవైపు ఇదే సమయంలో జాతీయ స్థాయి వేడుకలో పాల్గొని తమ కళను ప్రదర్శించే అవకాశం రావడంతో ఇక్కడి గిరిజన గుస్సాడి కళాకారులు మురిసిపోతున్నారు. జాతీయ స్థాయిలో తమ నైపుణ్యాన్ని, కళను ప్రదర్శించి అక్కడి ప్రజల మన్ననలను అందుకున్న కళాకారులపై అభినందనలు వెల్లువెత్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Chatisghad, Dance Plus