ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ కమ్యూనికేషన్ హబ్..బోర్డర్‌లో ఏం జరుగుతోంది..?

ఎల్‌వోసీ వెంబడి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి వాటి మీదుగా కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించాలని చూస్తోంది. అందుకోసం పీవోకేలోని నీలం వ్యాలీలో ఉగ్రవాదుల కోసం ఏకంగా కమ్యూనికేషన్ హబ్‌నే ఏర్పాటు చేసింది.

news18-telugu
Updated: August 16, 2019, 10:13 PM IST
ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ కమ్యూనికేషన్ హబ్..బోర్డర్‌లో ఏం జరుగుతోంది..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతోంది పాకిస్తాన్. ఆర్టికల్ 370 రద్దుని అడ్డంపెట్టుకొని కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పెద్ద కుట్రే చేస్తోంది. పాకిస్తాన్ నుంచి భారీ మొత్తంలో ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి జొప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎల్‌వోసీ వెంబడి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి వాటి మీదుగా కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించాలని చూస్తోంది. అందుకోసం పీవోకేలోని నీలం వ్యాలీలో ఉగ్రవాదుల కోసం ఏకంగా కమ్యూనికేషన్ హబ్‌నే ఏర్పాటు చేసింది. 50-60 కి.మీ. పరిధిలో ఈ కమ్యూనికేషన్ హబ్‌ని ఏర్పాటు చేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. కాలిఘాటి సెక్టార్‌లో ఈ కమ్యూనికేషన్ హబ్ ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎల్‌వోసీ వెంట భారత సైన్యం భద్రత, జవాన్ల కదలికల గురించి సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరు చేరవేసుకుంటారు. భారత భద్రతా బలగాలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా వెంటనే ఎల్‌వోసీ మీదుగా కశ్మీర్‌లోకి చొరబడాలని టెర్రరిస్టులు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి గస్తీకాస్తున్న భద్రతా దళాలను భారత సైన్యం అప్రమత్తం చేసింది. అంతా అలర్ట్‌గా ఉండాలని...ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.

గురువారం రాత్రి కశ్మీర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కీరణ్ సెక్టార్‌లో జరిగిన చొరబాటు యత్నాలను తిప్పికొట్టామని వెల్లడించాయి. టెర్రరిస్టులను భారత్‌లోకి పంపేందుకు పాకిస్తాన్ ఆర్మీ అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని ఆర్మీ అధికారులు చెప్పారు. ఓ వైపు ఉగ్రవాదులను ఎగదోస్తూనే మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైనికులు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. కాగా, గురువారం ఉదయం రాజౌరి, ఉరీ సెక్టార్‌లో కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్ ఆర్మీ. దాయాది కాల్పులను ధీటుగా ఎదుర్కొన్న భారత సైనికులు..ఎదురుదాడి చేసి ముగ్గురు పాకిస్తాన్ జవాన్లను హతమార్చారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>