ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. బుడిబుడి నడకలు, బుజ్జిబుజ్జి మాటలతో అల్లరి చేస్తుంటారు. ముద్దులొలికే చిన్నారులను చూసి తల్లిదండ్రులు తెగ మురిసిపోతుంటారు. ఇక చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుప్పలు కుప్పలుగా బొమ్మలు ఉండడం కామన్..! వాటితో ఆటలే చిన్నారులకు కాలక్షేపం..! ఐతే కొందరు పిల్లలకు బొమ్మలతో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది. తమకు ఇష్టమైన బొమ్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఈ చిన్నారి కూడా అలాంటిదే..! తన బొమ్మ అంటే ఎంత ఇష్టమంటే..ఆ చిన్నారికి ట్రీట్మెంట్ చేసేందుకు తన బొమ్మను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపతో పాటే బెడ్‌పై పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేశారు డాక్టర్లు.
ఢిల్లీకి చెందిన ఈ చిన్నారి పేరు జిక్రా మాలిక్. వయసు 11 నెలలు. జిక్రా దగ్గర ఓ అందమైన బొమ్మ. ఆ బొమ్మంటే జిక్రా ఎంతో ఇష్టం. అది లేనిదే ఏ పనీ చేయదు. బొమ్మకు పాలుపడితేనే జిక్రా పాలుతాగుతుంది. బొమ్మకు గోరుముద్దలు పెడితేనే జిక్రా తింటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బొమ్మను విడిచి జిక్రా ఒక్క క్షణం కూడా ఉండలేదు. అదీ ఆ బొమ్మతో జిక్రాకు ఉన్న అనుబంధం..! ఐతే ఆగస్టు 17న బెడ్‌పై నిద్రిస్తున్న సమయంలో జిక్రా కిందపడింది. ఆమె కాలుకు ఫ్యాక్చర్ కావడంతో తల్లిదండ్రులు లోక్‌నాయక్ హాస్పిటల్‌కు తరలించారు.
ఆస్పత్రి పడకపై పాప, బొమ్మ
జిక్రా మాలిక్‌కు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె బిగ్గరగా ఏడ్చేది. వైద్యులకు సహకరించేది కాదు. ఒకే చోట కుదురుగా ఉండేది కాదు. దాంతో ఆమెకు ట్రీట్మెంట్ చేయడం డాక్టర్లకు ఇబ్బందిగా మారింది. పెయిన్ కిల్లర్లు, చాక్లెట్లు ఎన్ని ఇచ్చినా ప్రయోజ లేకపోయింది. ఈ క్రమంలో జిక్రా తల్లికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే ఇంటికి వెళ్లి జిక్రాకు ఇష్టమైన బొమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చింది. తన బొమ్మను చూడగానే తెగ సంతోషపడింది జిక్రా. ఆ బొమ్మను చూపిస్తూ వైద్యులు ట్రీట్మెంట్ ప్రారంభించారు. ముందుగా బొమ్మకు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు నటించి..ఈ తర్వాత జిక్రాకు చికిత్స అందించారు.
ఆస్పత్రి పడకపై పాప, బొమ్మ
తమ పాప ఇంట్లోనూ ఇలానే చేసేదని జిక్రా తల్లి దండ్రులు చెప్పారు. ఆ బొమ్మను చూపిస్తూనే జిక్రాకు పాలు, భోజనం పెట్టేవారమని వెల్లడించారు. ప్రస్తుతం జిక్రా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు. కాగా, ఆస్పత్రి బెడ్డుపై జిక్రాతో పాటు బొమ్మ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్ అంటూ.. వైద్యుల చికిత్స విధానాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.