TN Seshan | ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు.. టీఎన్ శేషన్ ప్రత్యేకతలివే...

TN Seshan | దేశంలో అప్పటివరకు జరిగిన ఎన్నికల సరళి ఓ ఎత్తైతే... టి.ఎన్.శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల శైలి మరో ఎత్తు. ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక మార్పులతో పాటు, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు శేషన్ చేసిన సేవలు అమోఘం.

Kishore Akkaladevi | news18-telugu
Updated: November 10, 2019, 11:28 PM IST
TN Seshan | ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు.. టీఎన్ శేషన్ ప్రత్యేకతలివే...
టి.ఎన్.శేషన్(ఫేస్ బుక్ ఇమేజ్)
  • Share this:
ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ను మించిన ఆయుధం మరొకటి లేదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో గతంతో పోలిస్తే ఓటర్లలో చాలావరకు చైతన్యం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇందుకోసం కొందరు చేసిన కృషి ఎంతో అపూర్వం. అలాంటి వారిలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టి.ఎన్.శేషన్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన...దేశంలో ఎన్నికల నిర్వహణ అంశంలో ఎవరూ ఊహించని సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా చూసిన వారంతా అంగీకరిస్తారు.

టి.ఎన్.శేషన్(ఫేస్ బుక్ ఇమేజ్)


దేశంలో అప్పటివరకు జరిగిన ఎన్నికల సరళి ఓ ఎత్తైతే... కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ వచ్చిన తరువాత ఎన్నికల సరళి మరో ఎత్తు. ఎన్నికల నిర్వహణతో పాటు ఓటర్లలో అవగాహన కల్పించేందుకు టీఎన్ శేషన్ తీసుకున్న చర్యలనే ఇప్పటికీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అమలు చేస్తున్నాయంటే... ఆయన ఎలాంటి మార్పు తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు.


1990-96 మధ్య కాలంలో కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు టి.ఎన్. శేషన్. ఈయన పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. 1955 తమిళనాడు కేడర్‌కు చెందిన శేషన్... రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు.

టి.ఎన్.శేషన్(ఫేస్ బుక్ ఇమేజ్)


1989లో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం... కేంద్ర ఎన్నికల సంఘం 10వ చీఫ్ కమిషనర్‌గా శేషన్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సారధిగా ఆయన తీసుకున్న పలు విప్లవాత్మకమైన చర్యలు... ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారులు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి కూడా శేషనే అని చెప్పకతప్పదు. ఎన్నికలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిగా టి.ఎన్. శేషన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఇష్టానుసారంగా ఉల్లంఘించిన చాలామంది... ఆయన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘంచేందుకు సాహించలేకపోయారు.

ఆయనంటే నచ్చని వాళ్లు...ఆయనను పనితీరును వర్ణించేందుకు అల్సేషన్ అనే పదాన్ని వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ల కనుసన్నల్లో పనిచేసేదన్న అపవాదును కూడా టీఎన్ శేషన్ పటాపంచలు చేశారు.
భార్య జయలక్ష్మితో శేషన్(ఫేస్ బుక్ ఇమేజ్)


అసలు శేషన్ ఏం చేశారు ?
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా ఉన్న సమయంలో శేషన్ పలు కీలక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ అన్నది సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అనేక చర్యలు చెపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ ఓటర్ ఐడీ కార్డు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి పరిధులను ఫిక్స్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరును మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశారు. ఇందుకోసం రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను సాధ్యమైనంతవరకు వినియోగించుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడంలో గణనీయమైన స్థాయిలో మంచి ఫలితాలు సాధించగలిచారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాలను అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దనే నియమాన్ని గట్టిగా అమలు చేశారు. అన్నిటికీ మించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే నాయకుల పాలిట సింహ స్వప్నమయ్యారు.

టి.ఎన్.శేషన్(ఫేస్ బుక్ ఇమేజ్)


ఉన్నతమైన వ్యక్తిత్వం
టి.ఎన్. శేషన్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఉన్నతమైనదే. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న తిరునెళ్లైలో 1932, డిసెంబర్ 15న జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అనంతరం ఐఏఎస్‌(ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)కు సెలెక్ట్ అయిన శేషన్ 1968లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ అంశంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. అంతకుముందు ఐపీఎస్‌కు కూడా సెలెక్ట్ అయిన శేషన్... దాన్ని కాదని ఐఏఎస్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. 1959లో జయలక్ష్మీని పెళ్లాడారు. శేషన్, జయలక్ష్మీ దంపతులకు పిల్లలు లేరు. జయలక్ష్మీ 2018 మార్చిలో కన్నుమూశారు.

1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన శేషన్... నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేతిలో ఓడిపోయారు. 2012లో మద్రాస్ హైకోర్టు ఆయనను పచియప్ప ట్రస్ట్‌కు మధ్యంతర నిర్వాహకుడిగా నియమించింది. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్న శేషన్... తనతో పాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న మరికొందరు అనాధ వృద్ధులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. శేషన్‌కు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. పుట్టపర్తి సత్యసాయబాబాను ఆయన ఎక్కువగా ఆరాధించేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లొ ఆయనకు ‘రామన్ మెగసెస్సే’ అవార్డు దక్కింది.
First published: November 10, 2019, 11:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading