‘టైగర్ హబీబ్’... మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు బాగా సుపరిచితమైన పేరు. అంతగా అందరికీ తెలియడానికి అతను చేసిందేమీ సమాజ సేవ కాదు. క్రూరత్వం ఆయన బిజినెస్. స్మగ్లింగ్ సైడ్ బిజినెస్. ఇప్పుడు అర్థమైందిగా ‘టైగర్ హబీబ్’ అంటే ఎవరో. అతడు పులులను చంపి వాటి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. 20 ఏళ్లుగా సుందర్బన్ అడవుల్లో పులులను వేటాడుతూ.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు బంగ్లాదేశ్‌లో అతడిని పట్టుకున్నారు. టైగర్ హబీబ్ అసలు పేరు హబీబబ్ తలుక్దర్. సుందర్ బన్ అడవుల సమీపంలో నివసిస్తూ.. పులులను వేటాడేవాడు.
పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో దాడులు చేస్తున్నారు అని తెలిస్తే పారిపోయేవాడు. మళ్లీ కొన్నాళ్లకు తిరిగి అక్కడికి వచ్చి ఎప్పటిలాగే తన పని చేసుకునేవాడట. ఇన్నాళ్లూగా తప్పించుకు తిరిగిన టైగర్ హబీబ్‌ను ఎట్టకేలకు పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందర్ బన్ అడవుల్లో.. అందులోనూ భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో టైగర్ హబీబ్ మకాం వేసేవాడని పోలీసులు చెబుతున్నారు.
సుందర్బన్ అడవుల్లో బెంగాల్ టైగర్లు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. వాటిని వేటాడి చంపి... చర్మం, ఎముకలు, మాంసాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడు. వాళ్లు వాటిని చైనా, ఇతర దేశాల్లో విక్రయించేవారు. అలా ఇప్పటివరకు టైగర్ హబీబ్ సుమారు 70 బెంగాల్ టైగర్స్‌ను చంపుంటాడని పోలీసులు, అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టైగర్ హబీబ్ తొలుత అడవిలో తేనెను దొంగతనం తీసి... అమ్ముకునేవాడట. ఆ తర్వాత కొన్నాళ్లకు పులుల వేట మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు పులుల వేటలో టైగర్ హబీబ్ రాటుదేలిపోయాడని ఆ ప్రాంతంలో తేనెను తీసే అతని సహచరులు చెబుతుంటారు. పులుల వేటకు అతనొక్కడే వెళ్లేవాడని చెబుతున్నారు.
టైగర్ హబీబ్ అరెస్టు... పులుల సంరక్షణలో అతిపెద్ద ఊరటనిచ్చే అంశమని సుందర్బన్ అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం బెంగాల్ టైగర్ల సంఖ్య రోజుకు రోజుకు తగ్గిపోతోంది. 2004లో ఈ పులుల సంఖ్య 440 ఉండగా... 2015 నాటికి 106కి చేరాయి. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపడుతూ వచ్చారు. అలా 2019 నాటికి వాటి సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 106 నుంచి 114కి పులుల సంఖ్య చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger, West Bengal