హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Watch Video: ఊరిపై పడ్డ పులి.. ఫారెస్ట్ అధికారుల కాల్పులు

Watch Video: ఊరిపై పడ్డ పులి.. ఫారెస్ట్ అధికారుల కాల్పులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీహార్‌లో గ్రామస్తులపై ఓ చిరుత విరుచుకుపడింది. పులి వేటతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు గ్రామస్తులు. విషయాన్ని ఫారెస్ట్‌ అధికారులకు చేరవేయడంతో దాన్ని పట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు అధికారులు. గంటల పోరాటం తర్వాత ఎట్టకేలకు పులిని బంధించారు ఫారెస్ట్ అధికారులు. ఈ చిరుత దాడిలో గ్రామస్తులతో పాటు అటవీశాఖ సిబ్బంది గాయపడ్డారు.

ఇంకా చదవండి ...

అడవుల్లో ఉండే క్రూరమృగం..ఒక్కసారిగా ఊరి మీద పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గ్రామంలోకి రావడమే కాదు తన కంటపడిన వారిపై పంజా విసురుతూ గ్రామస్తులకు ప్రాణ భయాన్ని కలిగించింది. చిరుత పంజాకు చిక్కకుండా ఉండేందుకు జనం ప్రాణభయంతో పరుగులు పెట్టారు. బీహార్‌లోని ఛప్రాలోని సోన్‌పూర్‌ దగ్గర్లోని వాల్మీకినగర్‌ అడవుల్లో ఉండే ఓ చిరుత పులి ఉన్నట్టుండి బైజల్‌పూర్‌ గ్రామంపై విరుచుకుపడింది. ఎవరూ ఊహించన విధంగా గ్రామస్తులు ఎవరి పనుల్లో వాళ్లుండగా...చిరుత ఊళ్లోకి రావడమే కాకుండా ముందుగా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై దాడి చేసింది. పులి దాడిలో గ్రామంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. గ్రామంలోకి వచ్చిన పులిని పట్టుకునేందుకు...దాని పంజాకు ఎవరూ బలికాకుండా ఉండేందుకు గ్రామస్తులు పడరాని పాట్లు పడ్డారు. చిరుత ఊరిపై పడి జనం ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తోందని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫారెస్ట్ సిబ్బందిని ఘటన స్థలానికి పంపాలని సర్పంచ్ భరత్‌సింగ్‌, మరికొందరు గ్రామ పెద్దలు జిల్లా అధికారయంత్రాగాన్ని కోరారు.

చిరుతను బంధించేందుకు ముప్పుతిప్పలు..

సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ రుచిసింగ్‌ తన బృందంతో గ్రామాన్ని అన్నీ వైపుల ముట్టడించారు. చిరుత తప్పించుకుకోకుండా ఉండేలా వలలు, పులిని బంధించే బోన్‌లతో ఆపరేషన్ వేగవంతం చేశారు. పులి బారి నుంచి గ్రామస్తుల్ని రక్షించే క్రమంలో చిరుత తన పంజా విసరడంతో ఫారెస్ట్ అధికారులతో పాటు ఓ కార్మికుడు గాయపడ్డారు. పులిని కట్టడి చేసేందుకు పాట్నా నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారి తన చేతిలో ఉన్న ట్రాంక్వీలైజర్‌ తుపాకితో కాల్చడంతో చిరుత స్వల్పంగా గాయపడటంతో వెంటనే అటవీ సిబ్బంది అప్రమత్తమై దాన్ని వలలో బంధించారు.


ఊపిరి పీల్చుకున్న జనం..

ఈ మొత్తం ఆపరేషన్‌ పూర్తయ్యే వరకు చిరుత సృష్టించిన భయానక పరిస్థితులతో అటు అటవీశాఖ అధికారులు, ఇటు గ్రామస్తులు గజగజవణికిపోయారు. పులిని బంధీంచడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిరుత దాడిలో గాయపడిన వాళ్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అడవులు అంతరించిపోవడం, మరికొన్ని చోట్ల అడవుల చుట్టు పక్కల ప్రాంతాలను తమ ఆవాసంగా జనం మార్చుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల వల్లే క్రూరమృగాలు అడవుల్లోంచి బయటకు వచ్చి జనంపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇక బీహార్‌లో చిరుత ఊరి జనంపై చేసిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Bihar, Viral Video

ఉత్తమ కథలు