Home /News /national /

Mamata Banerjee: ఉత్కంఠ పోరులో విజయం.. బెంగాల్‌తో పాటు నందిగ్రామ్‌ను గెలుచుకున్న మమత బెనర్జీ

Mamata Banerjee: ఉత్కంఠ పోరులో విజయం.. బెంగాల్‌తో పాటు నందిగ్రామ్‌ను గెలుచుకున్న మమత బెనర్జీ

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

Mamata Banerjee: నందిగ్రామ్‌లో మమత బెనర్జీ విజయంతో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ విజయం సంపూర్ణం అయినట్టు ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ఉత్కంఠ వీడింది. పశ్చిమ బెంగాల్‌లో తన సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను ఘన విజయం దిశగా తీసుకెళుతున్న మమత బెనర్జీ.. తాను స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్ నుంచి గెలుస్తారా లేదా అనే అంశంపై స్పష్టం వచ్చింది. చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం.. చివరకు మమత బెనర్జీని వరించింది. చివరి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మమత విజయం సాధించారు. నందిగ్రామ్‌లో మమత బెనర్జీ విజయంతో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ విజయం సంపూర్ణం అయినట్టు ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీతో హోరాహోరీగా తలపడింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకోవడంతో.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే తృణమూల్‌లోని అనేక మంది కీలక నేతలు బీజేపీలో చేరారు. నందిగ్రామ్‌లో మమత బెనర్జీ పోటీ చేస్తున్న సువేందు అధికారి కూడా ఆ రకంగానే ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన నాయకుడు కావడం విశేషం.

    నందిగ్రామ్‌లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మమత బెనర్జీ సవాల్ విసరగా... మమతను 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడించకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సువేందు అధికారి సవాల్ విసిరారు. దీంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తయితే.. నందిగ్రామ్ ఫలితం మమత బెనర్జీకి మరో పరీక్షగా మారింది. మమత బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగడంతో... నందిగ్రామ్‌లో పోటీ హోరాహోరీగా సాగింది.

    తొలి రౌండ్‌ నుంచి మమత బెనర్జీపై సువేందు అధికారి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఓ వైపు బెంగాల్‌లో మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌ 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చినా.. నందిగ్రామ్‌లో మాత్రం ఆమెకు విజయం ఏకపక్షంగా దక్కలేదు. ఎప్పటిప్పుడు సువేందు అధికారి ఆమెకు గట్టి పోటీ ఇస్తూ రావడంతో.. నందిగ్రామ్‌లో మమత బెనర్జీ ఓడిపోతారా ? అనే టెన్షన్ కూడా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులను వెంటాడింది. మమత ఓడిపోతే బెంగాల్‌లో టీఎంసీ సాధించిన ఘనవిజయం ఫలితాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించలేమని వారంతా భావించారు. అయితే చివరి రౌండ్‌ కౌంటింగ్‌లో ఈ ఉత్కంఠకు తెరపడింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో మమత బెనర్జీ విజయం సాధించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: 5 State Elections, Mamata Banerjee, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు