కరోనా మహమ్మారి ప్రపంచంలోకి ప్రవేశించాక వర్క్ ఫ్రం హోమ్ (Work from Home) సాధారణమైపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు వీలున్న అన్ని సంస్థలు ఉద్యోగులకు ఆ సదుపాయం ఇచ్చేశాయి. అయితే తమ వర్క్ ఫ్రం హోమ్‌ను మహారాష్ట్రకు చెందిన ముగ్గురు టెక్కీలు వర్క్ ఫ్రం సైకిల్‌గా మార్చుకున్నారు. ఎలా అంటే..
బెకన్ జార్జ్, ఆల్విన్ జోసెఫ్, రతిశ్ భలేరావు వర్క్ ఫ్రం హోమ్‌లో కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. వారు నెల రోజుల పాటు ఎలాంటి సెలవులు పెట్టకుండానే సైక్లింగ్ ట్రిప్ చేశారు. ముంబై నుంచి కన్యాకుమారి వరకు 1,687 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. మరి ఆఫీస్ వర్క్ సంగతేంటంటారా.. హైవేల పక్కన ఢాబాలు, లాడ్జిల్లో లాప్‌ట్యాప్‌లు ఓపెన్ చేసి.. లాగిన్ అయి పని చేసుకునేవారు.
ఒకేచోట ఆగిపోకుండా వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రయాణంగా, ఆడ్వెంచర్గా మార్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని ఆ ముగ్గురు స్నేహితులు చెప్పారు. ఎక్కువ కాలం ఇంట్లోనే పని చేసి నెగిటివ్ ఆలోచనలు, చిరాకు రాకుండా ఇలా వర్క్ ఫ్రం సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నామని, చేసేశామని అన్నారు. తమ కష్టానికి తగినంతగా సంతోషాన్ని పొందామని అన్నారు.
ముందుగా నవంబర్లోనే జార్జ్‌కు ఈ ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులకు చెప్పాడు. గతేడాది నవంబర్‌లో మొదలైన వారి ప్రయాణం డిసెంబర్లో ముగిసింది.
ఆ నెల రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి 11 గంటల వరకు సైక్లింగ్ చేసి ఆ తర్వాత పని చేసుకునేవారు. ప్రతి రోజు ఇలా 80 కిలోమీటర్లు ప్రయాణించే వారు. ఇక వీకెండ్స్‌లో, సెలవుల సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కేవారు.
“ఇది మాకు కచ్చితంగా మేలు చేసింది. వెకేషన్గానూ హాలీడేస్గానూ ఎంజాయ్ చేశాం. అడ్వెంచరస్ హాలీడే అంటే మనకు మనం బహుమతి ఇచ్చుకున్నట్టే. సైక్లింగ్ కాబట్టి పెద్దగా కష్టమని కూడా అనిపించలేదు. ఎంతో స్వేచ్ఛగా, సంతోషంగా అనిపిస్తోంది” జార్జ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చాలాసార్లు చాలా ఎండలోనూ, వర్షంలోనూ ప్రయాణించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు.
“ఈ గాడ్జెట్స్ కాస్త బరువనిపించాయి. కానీ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల తప్పలేదు. ఢాబాలనే మా వర్క్ స్టేషన్లుగా మార్చుకున్నాం. ఇది చాలా ఫన్‌గా అనిపించింది” అని జార్జ్ అన్నాడు. ఈ ఫొటోలు, వీడియోలను వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.